సాక్షి, ఇస్లామాబాద్ : ‘డాక్టర్ బ్రైడ్స్...డాక్టర్ బహు’...ఈ పదాలు పాకిస్థాన్‌లో ఎంతో పాపులర్. మధ్యతరగతి, ఉన్నతి తరగతి చెందిన పాకిస్తాన్ కుటుంబాలన్నీ ఇంటికి కోడలుగా డాక్టర్ రావాలని అత్తగారు, డాక్టర్ భార్య కావాలని యువకులు కోరుకుంటారు. వారి కోరికకు తగ్గట్టుగానే పాకిస్థాన్ యువతులంతా డాక్టర్ డిగ్రీ అందుకునేందుకు కష్టపడి చదువుతారు. డాక్టర్ వృత్తి మీదున్న గౌరవంతో కాదు, కేవలం మంచి సంబంధాలు వస్తాయన్న కారణంగానే వారంతా ఆ కోర్సులకు ఎగబడుతున్నారు.
డాక్టర్ పట్టా చేతికి రాగానే యువతులు మంచింటి సంబంధాన్ని వెతుక్కొని పెళ్లి చేసుకుంటారు. డాక్టర్ కొలువులో చేరకుండా ఎక్కువ మంది చదువుకు గుడ్‌బై చెప్పి గహస్థు జీవితంలో స్థిరపడుతున్నారు. ఎంతో డబ్బు, శ్రమను ఉపయోగించి డాక్టర్ చదివి ఆ వత్తిలో స్థిరపడకపోతే బాధ అనిపించదా ? అని ఆ యువతులను ప్రశ్నించగా, కేవలం మంచి సంబంధం వెతుక్కోవడం కోసమే కష్టపడి చదివామని, ఆర్థిక స్థోమత కలిగిన ఇళ్లలోకే అడుగుపెడుతుండడం వల్ల ఇంకా ఆర్థికంగా సంపాదించాల్సిన అవసరం ఏమీ లేదని, పిల్లా పాపలతో చల్లగా జీవించడమే తమకు కావాల్సిందని చెబుతున్నారు.
ఇక డాక్టర్ చదివిన పిల్లను ఇంట్లో పెట్టుకోవడం ఏమిటని భర్తను, అత్తామామలను ప్రశ్నిస్తే భార్య డాక్టరని, డాక్టర్ కోడలని చెప్పుకోవడంలో తమకు ఎంతో హోదాతోపాటు తృప్తి లభిస్తుందన్నారు. పైగా ఇంట్లో ఎవరికి ఏ జబ్బు చేసినా ప్రాథమికంగా తీసుకోవాల్సిన చర్యలేమిటో తెల్సిన డాక్టర్ ఇంట్లో ఉంటే మంచిదికదా! అని కూడా అంటున్నారు. అంతే కాకుండా డాక్టర్ కోడలు ఇంట్లో తిరుగుతుంటే లక్ష్మీ కూడా ఇంట్లో తిరుగుతుంటుందన్నది తమ నమ్మకమని చెబుతున్నవారు ఉన్నారు. పాకిస్థాన్ డాక్టర్లలో 2004 సంవత్సరం వరకు మగవాళ్లదే పైచేయి. ఆ సంవత్సరమే మొట్టమొదటిసారిగా మగవారిని మించి మహిళలు డాక్టర్ కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి మహిళలదే పైచేయి. 2013 నుంచి ‘డాక్టర్ బ్రైడ్స్’ ఓ సంప్రదాయంగా బలపడడంతో డాక్టర్ చదివే అమ్మాయిల సంఖ్య విపరీతంగా పెరిగింది.
ఈ పరిణామాన్ని చూసి కంగారుపడిన ‘పాకిస్థాన్ మెడికల్ అండ్ డెంటల్ కౌన్సిల్’ 2014లో డాక్టర్ కోర్సుల్లో మహిళల కోటాను 50 శాతానికి పరిమితం చేస్తూ ఓ విధాన నిర్ణయాన్ని తీసుకొచ్చింది. అయితే ఆ నిర్ణయాన్ని లాహోర్ కోర్టు కొట్టివేసింది. డాక్టర్ వృత్తికి ఎన్నిసీట్లను కేటాయిస్తున్నప్పటికీ దేశ ఆరోగ్య రంగంలో డాక్టర్ల కొరత తీవ్రంగా ఉంటోంది. దీంతో డాక్టర్ వృత్తి చదివి ఇంటికి పరిమితమవుతున్న మహిళలను ప్రోత్సహించాలని ప్రయత్నించింది. ఈ ప్రయత్నాలు ఫలించకపోగా మగవారు మెడికల్ కోర్సులను ఎంచుకోవడం తగ్గిపోయింది.
ఎంతో ఖర్చుపెట్టి ఎంబీబీఎస్ చదివినంత మాత్రాన లాభం లేదని, ఆపైన స్పెషలైజేషన్ కోర్సులు చేయాలని, ఆ సందర్భంగా ప్రాక్టీస్ చేస్తే నెలకు 70, 80 వేల రూపాయలు ఇచ్చేవారు కూడా లేరని, అదే ఇంజనీరింగ్ కోర్సును ఎన్నుకుంటే అంతకు పదింతలు డబ్బు అందుకునే అవకాశం ఉందని విద్యార్థులు చెబుతున్నారు. డాక్టర్ చదివినవారు కూడా పాకిస్థాన్‌లో స్థిరపడకుండా విదేశాలకు వెళుతున్నారు. ఆఘాఖాన్ యూనివర్శిటీలో డాక్టర్ పట్టా పుచ్చుకున్న దాదాపు 1100 మందిలో 900 మంది విదేశాలకు వెళ్లి స్థిరపడుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. అగ్ర దేశాలకు డాక్టర్లను అందిస్తున్న మూడవ అతిపెద్ద దేశంగా పాకిస్థాన్ గుర్తింపు పొందింది.
పాకిస్థాన్‌లో వైద్య రంగంలో రోజుకు ఎనిమిది గంటల పని విధానాన్ని ఇప్పటికీ అమలు చేయకపోవడం, తక్కువ వేతనాలు ఇవ్వడమే అందుకు కారణం. దీనివల్ల ప్రపంచంలో రోగులకు సరిపడా డాక్టర్లు ఉండాల్సిన నిష్పత్తిలో అతితక్కువగా ఉన్నది పాకిస్థాన్‌లోనే. అందుకనే ప్రసవం సందర్భంగా తల్లులు మరణించడం కూడా ఈ దేశంలోనే ఎక్కువ. నేటికి కూడా ప్రతి 89 మందిలో ఓ తల్లి ప్రసవం సందర్భంగా ప్రాణాలు కోల్పోతుంది. ఈ దశలోనైనా డాక్టర్ కోర్సులు చదివిన మహిళలు ఇంటికి పరిమితం కాకుండా వృత్తిలోకి రావాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. ఆ దిశగా ప్రచారం చేస్తున్నారు. వీరి ప్రచారం ప్రభావం చూపిస్తున్నట్లు ఉంది. ఈసారి డాక్టర్ కోర్సులు చదివిన మహిళల్లో 66 శాతం మంది డాక్టర్ వృత్తిలో స్థిరపడేందుకు తమ పేర్లను ఎన్‌రోల్ చేసుకున్నారు. గతంలో ఈ శాతం ఎన్నడూ యాభై శాతానికి మించలేదు.
Comments
Please login to add a commentAdd a comment