
వాషింగ్టన్: ఒక వ్యక్తి తరఫున ఒకటి కంటే ఎక్కువ హెచ్–1బీ వీసా దరఖాస్తులు వస్తే అన్నింటిని తిరస్కరించే వీలుందని అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం హెచ్చరించింది. అలాంటి దరఖాస్తుల్ని క్షుణ్నంగా పరిశీలిస్తామని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్) తెలిపింది. ఏప్రిల్ 2 నుంచి హెచ్–1బీ పిటిషన్లను స్వీకరించనున్న నేపథ్యంలో నిబంధనల్ని కఠినతరం చేస్తూ ఆదేశాలిచ్చింది.
హెచ్–1బీ వీసాల జారీలకు సంబంధిన లాటరీలో తమ పేరు ఎలాగైనా వచ్చేందుకు ఒక వ్యక్తి తరఫున ఒకటికంటే ఎక్కువ దరఖాస్తులు దాఖలవుతున్న నేపథ్యంలో తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ఏదైనా వ్యాపార అవసరముంటే తప్ప ఒకే లబ్ధిదారుడి తరఫున సంబంధిత సంస్థలు(రిలేటెడ్ ఎంటిటీస్) దాఖలుచేసే అన్ని హెచ్–1బీ పిటిషన్లను తోసిపుచ్చడం కానీ రద్దు చేయడంగానీ చేస్తాం’ అని స్పష్టం చేసింది.
హెచ్ 4 రద్దు చేస్తే తగ్గనున్న అమెరికాపై మోజు!
హెచ్–1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకిచ్చే హెచ్ 4 వీసా ప్రక్రియను ఒకవేళ ట్రంప్ సర్కారు రద్దు చేస్తే నిపుణులైన విదేశీ ఉద్యోగులకు అమెరికాపై ఆకర్షణ తగ్గే ప్రమాదముందని వలసదారుల అనుకూల సంస్థ ఒకటి తన నివేదికలో పేర్కొంది. హెచ్–1బీ వీసాపై వచ్చి శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న వారి జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు 2015లో ఒబామా ప్రభుత్వం వీలుకల్పించింది. అయితే ఆ పాలసీని రద్దు చేయాలని ట్రంప్ సర్కారు ప్రయత్నిస్తోంది. హెచ్ 4 వీసాతో జీవిత భాగస్వాములకు కూడా ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించడం వల్ల.. అదనపు ఆదాయం సమకూరడంతో నిపుణులైన విదేశీ ఉద్యోగులకు అమెరికా ఆకర్షణీయ ప్రాంతంగా కొనసాగుతుందని, ప్రతిభావంతుల్ని ఆకర్షించడంలో ఇతర దేశాలతో అమెరికా పోటీ పడేందుకు దోహదపడుతుందని ఆ నివేదిక తెలిపింది.
సిలికాన్ వ్యాలీ కంటే అక్కడే హెచ్–1బీలు ఎక్కువ..
అమెరికాలో సిలికాన్ వ్యాలీ కంటే తూర్పు తీర ప్రాంతం, టెక్సాస్ మెట్రో ప్రాంతాల్లోనే ఎక్కువమంది హెచ్–1బీ వీసాదారులు ఉన్నారని ‘ప్యూ’ సంస్థ తాజా పరిశోధనలో వెల్లడైంది. ఆ సంస్థ లెక్కల ప్రకారం.. 2010–2016 మధ్య కాలంలో మొత్తం 8,59,600 వీసాలు జారీ కాగా వాటిలో 2,47,900 మంది న్యూయార్క్ మెట్రో ప్రాంతంలోనే ఉద్యోగాలు చేస్తున్నట్లు తెలిపింది. టెక్సాస్ మెట్రో ప్రాంతంలో పెద్ద సంఖ్యలో హెచ్1–బీ వీసాదారులు పనిచేస్తున్నట్లు ‘ప్యూ’ నివేదిక పేర్కొంది.
సిలికాన్ వ్యాలీ కేంద్రమైన శాన్‌జోస్‌లో 2010–16 మధ్య కాలంలో 22,200 మంది హెచ్–1బీపై పనిచేశారని పేర్కొంది. డాలస్, వాషింగ్టన్ మెట్రో ప్రాంతాల్లో వరుసగా 74 వేలు, 64,800 మంది.. బోస్టన్‌లో 38,300 మంది హెచ్–1బీ వీసాదారులు నివసిస్తున్నట్లు వెల్లడించింది. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ తెలిపిన వివరాల ఆధారంగా ఈ విషయాల్ని వెల్లడించారు. టెక్సస్ కాలేజీ స్టేషన్ మెట్రో ప్రాంతంలో పనిచేసే ప్రతి వంద మందిలో 32 మంది హెచ్–1బీ వీసాదారులేనని, వారిలో 99% మంది అక్కడున్న కాగ్నిజెంట్ టెక్నాలజీ కార్పొరేషన్‌లో పనిచేస్తున్నారని తెలిపింది.
పాత ఫోన్ నంబర్లు, ఈమెయిల్ వివరాలివ్వాలి
హెచ్–1బీ వీసా దరఖాస్తు సమయంలో వారి పాత ఫోన్ నంబర్ వివరాలు, ఈ మెయిల్ చిరునామాలు, సోషల్ మీడియా వివరాల్ని వెల్లడించాల్సి ఉంటుందని అమెరికా ప్రభుత్వం పేర్కొంది. ఆ దేశ ఫెడరల్ రిజిస్ట్రీలో ప్రచురించిన డాక్యుమెంట్‌లో పేర్కొన్న వివరాల మేరకు.. ‘అమెరికా రావాలనుకుంటున్నవారు కొత్త నిబంధనలకు అనుగుణంగా కొన్ని ప్రశ్నలకు సమాధానమివ్వాలి.
అమెరికాకు ముప్పు కలిగించే వ్యక్తులు దేశంలోకి రాకుండా నిషేధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. గత ఐదేళ్లుగా ఉపయోగిస్తున్న సోషల్‌మీడియా ఖాతాల వివరాలు, ఫోన్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలు అందించాలి. ఇంతకుముందు ఏ దేశమైనా మిమ్మల్ని బహిష్కరించిందా? మీ కుటుంబంలో ఎవరికైనా ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలున్నాయా? తదితర ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి’ అని డాక్యుమెంట్‌లో స్పష్టం చేశారు. తాజా నిబంధనలపై స్పందన తెలియచేసేందుకు 60 రోజుల గడువునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment