హద్దు మీరుతున్న డ్రాగన్‌ | Narendra Modi High Level Review Over China Reactions | Sakshi
Sakshi News home page

హద్దు మీరుతున్న డ్రాగన్‌

Published Wed, May 27 2020 3:56 AM | Last Updated on Wed, May 27 2020 4:47 AM

Narendra Modi High Level Review Over China Reactions - Sakshi

సరిహద్దులో భారత బలగాలు (ఫైల్‌)

డ్రాగన్‌ బుసలు కొడుతోంది భారత్‌ సరిహద్దుల్లో నిఘా పెంచుతోంది సైనిక బలగాల్ని పెంచి హెచ్చరికలు పంపిస్తోంది 2017 నాటి డోక్లామ్‌ తరహా వివాదాన్ని రాజేస్తోంది కరోనాతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్న సమయంలో చైనా ఎందుకీ రంకెలు వేస్తోంది ?

న్యూఢిల్లీ/బీజింగ్‌: తూర్పు లదాఖ్‌ ప్రాంతంలో ఉద్రిక్తతలు అంతకంతకు తీవ్రతరమవుతున్నాయి. రెండు వారాల క్రితం ఈ ప్రాంతంలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ కొందరిని గాయాలపాలు చేసింది. లదాఖ్‌లోని గాల్వన్‌ లోయలో చైనా ఇటీవల 100 తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేసింది. సిక్కిం, టిబెట్‌లను కలిపే నుకులా పాస్‌ మార్గంలోనూ ఉద్రిక్తతల్ని పెంచి పోషిస్తోంది. కరోనా వైరస్‌ని అడ్డం పెట్టుకొని భారత్‌లోని చైనీయుల్ని వెనక్కి రప్పిస్తోంది. భారత్‌కు కేవలం 3 కి.మీ. ఆవల పాంగాంగ్‌ సరస్సు సమీపంలోని 1,200 నుంచి 1,300 సైనికుల్ని మోహరించింది. మొత్తంగా భారత సరిహద్దుల్లో 5 వేలమంది వరకు సైనికుల్ని మోహరించింది. చైనా చర్యలతో భారత్‌ కూడా అప్రమత్తమైంది. వాస్తవాధీన రేఖ మీదుగా బలగాలను పటిష్టం చేసింది. భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవాణే తూర్పు లదాఖ్‌ ప్రాంతంలో ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. పరిస్థితుల్ని లోతుగా విశ్లేషించడానికి భారత ఆర్మీ టాప్‌ కమాండర్లు బుధవారం నుంచి సమావేశాలు నిర్వహిస్తున్నారు.

మోదీ ఉన్నతస్థాయి సమీక్ష  
భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు అంతకంతకూ తీవ్రతరం కావడం, టిబెట్‌లో వైమానిక స్థావర విస్తరణ పనుల శాటిలైట్‌ చిత్రాలు బయటకి వచ్చిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం జరిపారు. దీంతోపాటు లదాఖ్‌లో నెలకొన్న పరిస్థితులపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌  రావత్, త్రివిధ దళాధిపతులతోపాటు విదేశాంగ  కార్యదర్శి హర్ష వర్ధన్‌ ష్రింగ్లాతోనూ చర్చించారు.

ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపే ప్రసక్తే లేదు 
భారత్, చైనా సరిహద్దుల్లో 3,500 కిలో మీటర్ల ప్రాంతంలో చేపట్టిన మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టుల్ని నిలిపివేసే ప్రసక్తే లేదని భారత్‌ తేల్చి చెప్పింది. ఈ ప్రాజెక్టుల్ని ఆపేయాలంటూ చైనా చేసిన హెచ్చరికల్ని పట్టించుకోబోమని స్పష్టం చేసింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరుదేశాల సైనికులు కొద్ది రోజులుగా ఆరు దఫాలుగా జరిపిన చర్చలు కూడా విఫలమయ్యాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌తో వరస సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. లదాఖ్, సిక్కిం, ఉత్తరాఖండ్, అరుణాచల్‌ సరిహద్దుల్లో నిర్మిస్తున్న కీలకమైన ప్రాజెక్టులేవీ ఆపాల్సిన పని లేదని రాజ్‌నాథ్‌  సింగ్‌ ఆర్మీ ఉన్నతాధికారులతో స్పష్టం చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి.

వైమానిక స్థావరం విస్తరణ 
లదాఖ్‌ సరిహద్దుల్లో చైనా ఒక వైమానిక స్థావరాన్ని శరవేగంగా విస్తరిస్తోంది. మే 5న భారత్, చైనా మధ్య సైనికులు ఘర్షణ పడిన పాంగాంగ్‌ సరస్సు ప్రాంతానికి 200 కి.మీ. దూరంలో ఎయిర్‌ బేస్‌ నిర్మాణ పనులకు సంబంధించిన శాటిలైట్‌ చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. మొదటి చిత్రం ఈ ఏడాది ఏప్రిల్‌ 6న తీస్తే, రెండోది మే 21న తీశారు. హెలికాప్టర్లు దిగడానికి వీలుగా నిర్మించిన ట్రాక్‌ రెండో చిత్రంలో చూడొచ్చు. చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ ఎయిర్‌ఫోర్స్‌కి చెందిన జే–11 లేదంటే జే–16 యుద్ధ విమానాలు నాలుగు వరసగా ఉండడం కనిపిస్తోంది. ఈ పరిణామాలు కలవరాన్ని పెంచుతున్నాయి.

యుద్ధ సన్నద్ధతను పెంచుకోండి సైన్యానికి జిన్‌పింగ్‌ పిలుపు 
యుద్ధ సన్నద్ధతను పెంచుకోవాలని, దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకోవాలని సైన్యానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఆదేశమిచ్చారు. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ), పీపుల్స్‌ ఆర్మ్‌డ్‌ పోలీసు ఫోర్స్‌ ప్లీనరీ సమావేశానికి హాజరైన సందర్భంగా జిన్‌పింగ్‌ ఈ పిలుపునిచ్చారు. ‘‘అత్యంత ప్రతికూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని శిక్షణ, సన్నద్ధతను పెంచుకోవాలి. సంక్లిష్ట పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవడం ద్వారా దేశ సార్వభౌమత్వాన్ని, భద్రతను, అభివృద్ధి ప్రయోజనాలను పరిరక్షించుకోవాలి’’ అని కోరినట్టు అధికారిక జిన్హువా న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. చైనా–భారత్‌ మధ్య సరిహద్దుల్లో సున్నిత పరిస్థితుల నేపథ్యంలో జిన్‌పింగ్‌ ఈ పిలుపునివ్వడం గమనార్హం.

ఆ ఆక్రోశం వెనుక.. 
1 దేశ సరిహద్లుల్లో మౌలిక సదుపాయలు పెంచుకుంటూ, సైనికులకు మెరుగైన వసతులు కల్పించడంలో చైనా ఎప్పుడూ ముందుంటుంది. భారత్‌ కూడా అదే వ్యూహంతో సరిహద్దుల్లోని చాలా ప్రాంతాల్లో సైనిక శిబరాలు ఏర్పాటు చేసి బలగాల్ని పెంచుతోంది. మౌలిక సదుపాయాల్ని కల్పిస్తూ సాంకేతికంగా కొత్త పరికరాలను సైన్యానికి అందుబాటులోకి తెచ్చి డ్రాగన్‌ దేశానికి సవాల్‌ విసురుతోంది. గాల్వన్‌ వ్యాలీలో దర్బాక్‌–షోయక్‌ నుంచి తూర్పు లదాఖ్‌లో దౌలత్‌ బేగ్‌ను కలుపుతూ రోడ్డు నిర్మించింది. ఇవన్నీ చైనాకి కంటగింపుగా మారాయి.

2 కరోనా వైరస్‌ చైనాలోని వూహాన్‌ ల్యాబ్‌ నుంచి వచ్చిందని పదే పదే ఆరోపిస్తున్న అమెరికా ప్రపంచంలో చైనాని ఏకాకిని చేయడానికి భారత్‌ వంటి దేశాల సహకారం తీసుకుంటోంది. వైరస్‌ పుట్టుక, ప్రపంచ దేశాలను హెచ్చరించడంలో డబ్ల్యూహెచ్‌ఓ వైఫల్యం వంటి అంశాలపై విచారణ జరిపించే తీర్మానానికి భారత్, మరో 62 దేశాలు మద్దతు పలికాయి. అమెరికా, ఆస్ట్రేలియా వంటి  దేశాలతో చేతులు కలపొద్దని చెప్పడానికే లదాఖ్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతల్ని రాజేసి భారత్‌కు ఒక హెచ్చరికలా చైనా పంపుతోంది.

3 కరోనా వైరస్‌ వ్యాప్తి అంశంలో చైనా నిర్లక్ష్యంగా వ్యవహరించిదంటూ ప్రపంచవ్యాప్తంగా చెలరేగుతున్న విమర్శలు ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పేరుప్రతిష్టల్ని దెబ్బ తీశాయి. అందుకే ఆ విషయం నుంచి దృష్టిని మరల్చడానికి దక్షిణాసియాలో పట్టు బిగించడానికి చైనా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే గత కొన్ని వారాల్లో భారత్‌తో తగాదాలకు దిగుతోంది.

4 కశ్మీర్‌ అంశంలో ఎప్పుడూ పాకిస్తాన్‌కు కొమ్ముకాసే చైనా ఇప్పుడు లదాఖ్‌ సరిహద్దుల్లో ఎన్నడూ అడుగు పెట్టని గ్వాలన్‌ లోయలోకి కూడా సైనికుల్ని పంపిస్తోంది. లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీ భూభాగాలను నేపాల్‌ తన మ్యాపుల్లో చూపించడం వెనుక చైనా ప్రమేయం ఉంది. హాంకాంగ్‌ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసేలా కొత్త భద్రతా చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఇలా ఆసియాలో ఏదో విధంగా ఉద్రిక్తతల్ని రాజేసే చర్యల్ని చేపడుతోంది.  

భారత్, చైనా సరిహద్దులు ఇలా .. 
► భారత్, చైనా సరిహద్దుల్ని మూడు సెక్టార్‌ల కింద విభజిం చారు. వీటిలో పశ్చిమ సెక్టార్‌ ఎప్పుడూ ఉద్రిక్తతలకి, చొరబాట్ల కి కేంద్ర బిందువుగా ఉంటోంది.  
► కేంద్ర పాలిత ప్రాంతమైన లదాఖ్‌ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి 1,597 కి.మీ. ప్రాంతాన్ని పశ్చిమ సెక్టార్‌ అంటారు.  
► హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ సరిహద్దుల్లో 545 కి.మీ. పొడవునా మధ్య సెక్టార్‌ ఉంది.  
► తూర్పు సెక్టార్‌లో 1,346 కి.మీ. మేర సరిహద్దు ఉంది. సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలకు ఈ సెక్టార్‌ సరిహద్దు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement