తాష్కెంట్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురువారం చైనా అధ్యక్షుడు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. రెండురోజుల పాటు జరుగనున్న ఎస్‌సీవో సమ్మిట్ (షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్)లో పాల్గొనేందుకు ఆయన ఇవాళ తాష్కెంట్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీ...చైనా అధ్యక్షుడితో సమావేశం అయ్యారు.
అంతకు ముందు ఉజ్బెకిస్థాన్ చేరుకున్న వెంటనే ప్రధాని మోదీ ట్విట్ చేశారు. 'స్నేహపూరిత దేశానికి మరోసారి రావటం సంతోషకరం. ఎస్సీవో సమ్మిట్లో పలువురు నేతలతో సమావేశం అవుతాను' అని మోదీ ట్విట్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో స్వాగతం పలికిన ఉజ్బెకిస్థాన్ ప్రధాని షౌకత్ మీర్జియోయెవ్తో కలిసి దిగిన ఫోటోను మోదీ పోస్ట్ చేశారు.
ఈ సమ్మిట్‌లో భారత్తో పాటు పాకిస్థాన్, చైనా, రష్యా,కిర్గిజ్ రిపబ్లిక్, కజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల అధినేతలు పాల్గొననున్నారు. దేశాల మధ్య శాంతి భద్రతల అంశంలో పరస్పర సహకారం, తీవ్రవాదం అణచివేత, రక్షణ రంగానికి సంబంధించిన చర్యలపై సమ్మిట్‌లో కీలక చర్చలు జరుపనున్నారు.
మరోవైపు ఈ పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో కూడా భేటీ కానున్నారు. న్యూక్లియార్ సప్లై గ్రూప్ దేశాల సమావేశం కూడా రేపటి నుంచే సియోల్‌లో ప్రారంభం అవుతుండటంతో మోదీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం కోసం అమెరికాతో పాటు రష్యా తదితర దేశాలు మద్దతిస్తున్నా చైనా వ్యతిరేకిస్తోందనే వార్తలు వస్తుండటంతో మోదీ పర్యటన కీలకం కానుంది.