కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తూర్పు చైనాలోని యంటాయ్ నగరంలో ట్రాక్టర్‌పై స్ప్రే చేస్తున్న దృశ్యం
బీజింగ్/న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. 26 దేశాలకు విస్తరించిన ఈ వైరస్.. ఒక్క చైనాలోనే శనివారం నాటికి 813 మందిని బలికొన్నది. వారిలో శనివారం ఒక్కనాడే చనిపోయిన వారి సంఖ్య 89 కాగా, కొత్తగా ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 2656, అనుమానిత కేసుల సంఖ్య 3,916. ఈ వైరస్ సోకి, చికిత్స పొందుతున్నవారి సంఖ్య శనివారం నాటికి 37 వేలు దాటింది. 2002–03లో ప్రపంచాన్ని వణికించిన ‘సార్స్’వైరస్‌ను మించిన ప్రమాదకారిగా ఈ కరోనా పరిణమించింది. నాడు ‘సార్స్’కారణంగా ప్రపంచవ్యాప్తంగా చనిపోయినవారి సంఖ్య 774 కాగా, కరోనా మృతుల సంఖ్య 800 దాటింది. కరోనా తరహాలోనే సార్స్ వైరస్‌ను కూడా మొదట చైనాలోనే గుర్తించారు. ఈ 2 కూడా ఒకే వైరల్ కుటుంబానికి చెందినవి కావడం గమనార్హం.ఒక్క చైనాలోనే 37 వేల మందికి పైగా కరోనా వైరస్‌తో బాధపడుతున్న నేపథ్యంలో.. 6,188 మంది బాధితుల పరిస్థితి విషమంగా ఉందని చైనా ఆరోగ్య శాఖ ప్రకటించిన పరిస్థితుల్లో.. సార్స్‌తో పోలిస్తే కరోనా కారణంగా చనిపోయే వారి సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. కరోనా కారణంగా ఫిలిప్పీన్స్‌లో ఒకరు, హాంకాంగ్‌లో ఒకరు చనిపోయారు. భారత్‌లో 3 నిర్ధారిత కేసులను గుర్తించారు. కేరళకు చెందిన ఆ ముగ్గురు ఇటీవల కరోనా విస్ఫోటనానికి కేంద్ర బిందువైన చైనాలోని వుహాన్ నగరం నుంచి వచ్చినవారే కావడం గమనార్హం.
ప్రజా యుద్ధం
కరోనా కట్టడికి చైనా ప్రజాయుద్ధమే(పీపుల్స్‌వార్) ప్రారంభించింది. వైరస్ వ్యాప్తిని నిరోధించడం, చికిత్స అందించడం, టీకాను రూపొందించే పరిశోధనలకు ఊతమివ్వడం..వంటి చర్యల కోసం 1200 కోట్ల డాలర్లకు పైగా కేటాయించింది. కరోనా బాధితుల కోసం వుహాన్ శివార్లలో 10 రోజుల్లోపే వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించింది. ‘కరోనా’విషయంలో సున్నితంగా స్పందించాలని చైనా ప్రపంచ దేశాలను కోరుతోం ది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అదే విషయాన్ని స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ను ‘వుహాన్ వైరస్’, ‘చైనా వైరస్’అని పిలవడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కరోనా కారణంగా చైనా అర్థిక వ్యవస్థపై తద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుం ది. ఇప్పటికే పలు దేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. చైనా నుంచి భారీగా బల్క్ డ్రగ్‌ను దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. ఈ పరిస్థితుల్లో చైనా నుంచి బల్క్ డ్రగ్ దిగుమతులు నిలిచి పోతే.. ఫార్మారంగంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆ నౌకలోని భారతీయులపై ఆందోళన
కరోనా వైరస్ కారణంగా జపాన్ తీరంలో నిలిపేసిన డైమండ్ ప్రిన్సెస్ నౌకలో చిక్కుకుపోయిన భారతీయుల గురించి ఆందోళన వ్యక్తమవుతోంది. 3,700 మంది ఉన్న ఆ నౌకలో పలువురికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు.ఆదివారం మరో ఆరుగురు ఆ వైరస్ బారిన పడినట్లు ప్రకటించారు. వారిని ఆçస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నామన్నారు. అయితే, ఆ నౌకలోని భారతీయులెవరికీ కరోనా సోకలేదని విదేశాంగ మంత్రి జైశంకర్ శుక్రవారం పార్లమెంట్లో ప్రకటించారు.
జిన్‌పింగ్ ఎక్కడ?
దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్న సమయంలో అధ్యక్షుడు జిన్‌పింగ్ అజ్ఞాతంలో ఉండటంపై చైనాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. జిన్‌పింగ్ తరఫున ప్రధానమంత్రి లీ కెక్వియాంగ్ మాత్రమే ప్రజల్లోకొస్తున్నారు.
ఆరు నెలల్లో టీకా?
కరోనా వ్యాధిని ఎదుర్కోవడానికి అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు వివిధ దేశాల శాస్త్రవేత్తలు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. లక్షల కోట్ల డాలర్ల వ్యయంతో సంయుక్తంగా ఈ ప్రాజెక్టు చేపట్టారు. సాధారణంగా ఒక టీకా తయారు చేయాలంటే ఏళ్లకి ఏళ్లు పడుతుంది. మొదట జంతువుల మీద , ఆపై మనుషులపై క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేయాలి, తర్వాతే ఆ వ్యాక్సిన్‌కి అనుమతి లభిస్తుంది. వ్యాధి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని 6 నెలల్లో వ్యాక్సి న్‌ను తయారు చేస్తామనిఆస్ట్రేలియా పరిశోధకుడు కీత్ చాపెల్ చెప్పారు.
భారత్ స్నేహ హస్తం
కరోనా వైరస్ కారణంగా అతలాకుతలమవుతున్న చైనాకు భారత్ స్నేహ హస్తం అందించింది. కరోనా కట్టడికి అవసరమైన ఏ సాయమైనా చేసేందుకు సిద్ధమని తెలిపింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు ఆదివారం లేఖ రాశారు. కరోనా కారణంగా మరణించిన కుటుంబాలకు మోదీ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చైనీయులకు సంఘీభావం తెలిపారు. గత వారం చైనా నుంచి 650 మంది భారతీయుల్ని సురక్షితంగా వెనక్కి తీసుకురావడంలో జిన్‌పింగ్ అందించిన సహకారాన్ని మోదీ తన లేఖలో కొనియాడారు. చైనాలోని భారతీయుల ఆరోగ్యం, భద్రత విషయంలో భారత్‌తో సమన్వయం చేసుకునేందుకు, కరోనాను ఎదుర్కొనే విషయంలో భారత్ సాయం తీసుకునేందుకు చైనా సిద్ధంగా ఉందని భారత్‌లో చైనా రాయబారి సున్ వీడాంగ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment