ఏలియన్స్ దాడి.. పోరాడేందుకు తొమ్మిదేళ్ల బాలుడు!
వాషింగ్టన్: ఒకవేళ గ్రహాంతర వాసులు భూమిపై దాడి చేస్తే వారి నుంచి భూగోళాన్ని రక్షించేందుకు ఏం చేయాలి అని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఆలోచించింది. ఇందుకోసం ప్లానెటరీ ప్రొటెక్షన్ అధికారిని కోసం అప్లికేషన్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే నాసా వారికి షాకిస్తూ న్యూజెర్సీకి చెందిన తొమ్మిదేళ్ల బాలుడు ఆ ఉద్యోగానికి తాను సరిపోతానంటూ దరఖాస్తు పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని నాసా స్వయంగా వెల్లడించింది. వివరాల్లోకెళ్తే..
న్యూజెర్సీకి చెందిన జాక్ డెవిస్ వయసు తొమ్మిదేళ్లు. కాగా, డేవిస్‌ను తన అక్క ఎప్పుడూ ఏలియన్ (గ్రహాంతరవాసి) అంటూ ఆటపట్టించేంది. ఎందుకంటే డేవిస్ ఎక్కువగా ఏలియన్లకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడంతో పాటు ఏలియన్లపై తీసిన మూవీలు చేసేవాడు. ఈ విషయాలను వివరిస్తూ.. అందుకే తాను ప్లానెటరీ ప్రొటెక్షన్ అధికారిగా పని చేయాలనుకుంటున్నట్లు తన దరఖాస్తులో పేర్కొన్నాడు. భూగోళాన్ని కాపాడేందుకు తాను సరైన వాడినని నమ్ముతున్నట్లు చెప్పిన మాటలు నాసా వారిని మెప్పించాయి.
నాసా ప్లానెటరీ సైన్స్ డైరెక్టర్ జిమ్ గ్రీన్ న్యూజెర్సీ బాలుడు డేవిస్‌కు ఓ లేఖతో బదులిచ్చారు. ‘ప్లానెటరీ ప్రొటెక్షన్ ఆఫీసర్ జాబ్ చాలా కష్టతరమైంది. భూమిపైకి దూసుకొచ్చే గ్రహ శకలాలు, ఇతర జీవాల గురించి తీవ్రంగా శోధించాల్సి ఉంటుంది. మేం నాణ్యమైన శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల కోసం అన్వేషిస్తుంటాం. నువ్వు బాగా చదువుకుని ఏదో ఒక రోజు నాసాకు ఎంపిక కావాలని ఆశిస్తున్నానంటూ’ డేవిస్‌లో ఉత్సాహాన్ని నింపారు.
మరోవైపు నాసా ప్లానెటరీ రీసెర్చ్ డైరెక్టర్ జోనాథన్ రాల్ స్వయంగా బాలుడు డేవిస్‌కు కాల్ చేసి అభినందించారు. ఇంత చిన్న వయసులో ఎంత గొప్పగా ఆలోచించావంటూ ప్రశంసించారు. అమెరికా జాతీయులు ఈ ఉద్యోగానికి అర్హులు. ఈ నెల 14లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఏటా రూ. 79.13 లక్షల నుంచి రూ. 1.18 కోట్ల జీతం. అంతరిక్షంలో ప్రయాణిస్తున్న సమయంలో వ్యోమగాములు, రోబోలు ఆర్గానిక్, బయోలాజికల్ పదార్థాలచేత ప్రభావితం కాకుండా చూడటం ఈ అధికారి ప్రధాన బాధ్యత.