వాషింగ్టన్: వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తూ.. వారి భవితవ్యంతో ఆడుకుంటున్న ట్రంప్ సర్కారు మరో కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆహారం, నగదు సాయం రూపంలో ప్రభుత్వ లబ్ధి పొందిన, పొందుతున్న వలసదారులకు గ్రీన్‌కార్డుల్ని నిరాకరించాలన్న ఆలోచనలో ఉంది. ఇది కార్యరూపం దాల్చితే అమెరికాలో నివసిస్తోన్న వేలాది మంది భారతీయులపై తీవ్ర ప్రతికూల ›ప్రభావం పడనుంది. ఈ ప్రతిపాదిత నిబంధనపై సెప్టెంబర్ 21న అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్‌ఎస్)కార్యదర్శి సంతకం చేశారు. ఆ శాఖ వెబ్‌సైట్‌లో వివరాల్ని అందుబాటులో ఉంచారు. కాగా అమెరికాలోని ప్రముఖ ఐటీ సంస్థలు, రాజకీయ నాయకులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాయి.
3.82 లక్షల మందిపై ప్రభావం
‘నివాస హోదా మార్పు లేదా వీసా కోరుకునేవారు.. అలాగే అమెరికాలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న వలసదారులు.. ఇంతకు ముందెన్నడూ ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి పొందలేదని నిరూపించుకోవాలి’ అని కొత్త నిబంధన పేర్కొంటోంది. భారతీయులపై ప్రభావం చూపనున్న హెచ్–4 వీసా వర్క్ పర్మిట్ల రద్దుపై 3 నెలల్లో నిర్ణయం తీసుకుంటామని ఫెడరల్ కోర్టుకు ట్రంప్ సర్కారు ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆహార సాయం, సెక్షన్ 8 కింద ఇచ్చే హౌసింగ్ వోచర్లను వాడుకుంటున్న వలసదారులకు గ్రీన్ కార్డులు నిరాకరించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఆహారం, నివాసం కోసం అమెరికాలో లక్షలాది మంది వలసదారులు ప్రభుత్వ సాయంపై ఆధారపడ్డారు.
ఆ దేశంలో చట్టబద్ధంగా నివసించేందుకు, పనిచేసుకునేందుకు వీలుగా గ్రీన్ కార్డు పొందాలంటే ఇప్పుడు వారంతా ప్రభుత్వం నుంచి అందే ఆర్థిక సాయాన్ని ఆశించకూడని తప్పని పరిస్థితిని కల్పించారు. మెడికేర్ కింద తక్కువ ఖర్చుతో మందులు అందుకుంటోన్న వలసదారులకు కూడా వీసా నిరాకరించే అవకాశముంది. ఇప్పటికే గ్రీన్‌కార్డులు పొందిన వారిపై ఈ నిర్ణయం ప్రభావం ఉండదు. న్యాయబద్ధంగా నివాస హోదా సాధించుకున్న వలసదారులు ప్రభుత్వ పథకాల లబ్ధి పొందకుండా చూసేందుకే ఈ నిర్ణయమని అమెరికా న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది అమల్లోకి వస్తే ఏడాదికి 3.82 లక్షల మందిపై ప్రభావం చూపే అవకాశముంది. శాశ్వత నివాస హోదా కోరుకుంటున్న వారు, తాత్కాలిక వీసాలపై ఉంటూ శాశ్వత ఆశ్రయాన్ని ఆశిస్తున్న విద్యార్థులు, ఉద్యోగులు ఎక్కువ ప్రభావితం కానున్నారు. ఆర్థికంగా తమను తాము పోషించుకోగలమని నిరూపించుకుంటేనే గ్రీన్‌కార్డు జారీ విధానాన్ని ఇంతవరకూ అమెరికా అమలుచేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment