‘మీరు ధైర్యంగా ఇక్కడ ఉండండి. మమ్మల్ని క్షమించండి. నిజానికి మేము అలాంటి వాళ్లం కాదు. అటువంటి సంకుచిత మనస్తత్వం గల వ్యక్తులు ఎప్పటికీ గెలవలేరు. ప్రేమను ఎంచుకోండి. ప్రశాంతంగా జీవించండి’ అంటూ న్యూజిలాండ్ వాసులు క్రైస్ట్‌చర్చ్ మసీదు కాల్పుల బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. తమ దేశంలో ముస్లిం సోదరుల పట్ల జరిగిన అమానుష చర్యకు క్షమాపణలు చెబుతున్నారు. ఎప్పుడు ఎలాంటి సహాయం అవసరమైనా సరే తమను సంప్రదించాలంటూ బొటానికల్ గార్డెన్‌లో.. పెద్దలు ఫోన్ నంబర్లు షేరు చేస్తుండగా.. పిల్లలు తమ బొమ్మలు, పువ్వులు, గ్రీటింగ్ కార్డులు అక్కడ ఉంచి శాంతి సందేశం అందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం కాల్పుల మోతతో దద్దరిల్లిన లిన్‌వుడ్ మసీదు ఇమామ్ ఇబ్రహీం అబ్దుల్ హలీం మాట్లాడుతూ..: ‘ తూటాలు తప్పించుకునేందుకు ప్రతీ ఒక్కరు నేలపై పడి వదిలివేయమని అర్థించారు. అయినా దుండగులు కనికరం చూపలేదు. సమీపంలో ఉన్న మహిళలు ఏడ్వడం బిగ్గరగా ఏడ్వడం మొదలుపెట్టారు. అయితే మేము ఇప్పటికీ ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాము. నా పిల్లలు ఇక్కడ సంతోషంగా ఉంటారని నమ్ముతున్నాను. ఈ ఘటన ద్వారా తీవ్రవాదులు మాలో ఉన్న విశ్వాసాన్ని ఏమాత్రం సడలించలేరు. ఇటువంటి ఆపత్కర సమయంలో మాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి బాధిత కుటుంబాల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నా’ అని భావోద్వేగానికి లోనయ్యారు. కాగా లిన్‌వుడ్ మసీదులో సుమారు ఏడుగురు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది.
చదవండి : న్యూజిలాండ్‌లో నరమేధం
ఇక అత్యంత శాంతియుతమైన దేశాల్లో రెండో స్థానంలో ఉన్న, ప్రశాంతతకు మారుపేరైన దీవుల సముదాయం న్యూజిలాండ్‌లోని రెండు మసీదుల్లోకి దుండగులు చొరబడి ప్రార్థనల్లో ఉన్న వారిపై కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఇందుకు సంబంధించిన వీడియోలను ఫేస్‌బుక్‌లో లైవ్‌స్ట్రీమ్ చేస్తూ భీతిగొల్పేలా ప్రవర్తించారు. ఈ దుర్ఘటనలో 49 మంది మృతి చెందగా, మరో 20 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో తమ దేశంలో జాత్యహంకారి జరిపిన నరమేధం పట్ల న్యూజిలాండ్ వాసులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ముస్లింలపై జరిగిన ఈ దాడి హేయమైనదని ఖండిస్తున్నారు. ఇక ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ‘న్యూజిలాండ్ చరిత్రలోనే ఇదో చీకటి రోజు’ అని ఉద్వేగానికి గురయ్యారు.
చదవండి : ఫేస్‌బుక్ లైవ్‌తో రాక్షసానందం
Comments
Please login to add a commentAdd a comment