
భారత పర్యటనలో నిక్కీ హేలీ (ఫైల్ ఫొటో)
సాక్షి, న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా నియమితులైన తర్వాత నిక్కీ హేలీ తొలిసారిగా భారతదేశ పర్యటనకు వచ్చారు. రెండు రోజుల పాటు కొనసాగనున్న పర్యటన సందర్భంగా పలువురు భారత సీనియర్ అధికారులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులతో ఆమె సమావేశం కానున్నారు. బుధవారం ఉదయం భారత్‌కు చేరుకున్న నిక్కీ.. భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్‌తో కలిసి మొఘల్ చక్రవర్తి హుమాయున్ సమాధిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారత్‌కు వస్తే తన సొంత ఇంటికి తిరిగి వచ్చిన భావన కలుగుతుందన్నారు. ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, సైనిక సహకారం తదితర అంశాల్లో భారత్- అమెరికాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయడమే తన పర్యటన లక్ష్యమని నిక్కీ పేర్కొన్నారు. ఎన్నో విషయాల్లో భారత్, అమెరికాలకు సారూప్యం ఉందని.. అందుకే రెండు దేశాల మధ్య స్నేహబంధం రోజురోజుకీ బలపడుతోందని ఆమె వ్యాఖ్యానించారు.
మత స్వేచ్చకే అధిక ప్రాధాన్యం..
సంస్కృతీ సంప్రదాయాలకు భారత్ ఎంత విలువ ఇస్తుందో తెలుసుకోవడానికి హుమాయున్ సమాధి ఒక నిదర్శనమని నిక్కీ అన్నారు. చారిత్రక సంపదను కాపాడటం ప్రతీ ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు మనం అందించగలిగే గొప్ప కానుక వారసత్వ సంపదేనని ఆమె వ్యాఖ్యానించారు. భిన్నత్వంలో ఏకత్వం భారత్‌కు ఉన్న గొప్ప లక్షణమని కొనియాడారు. అన్ని హక్కుల కన్నామత స్వాతంత్ర్యపు హక్కు ఎంతో ముఖ్యమైనదిగా తాము భావిస్తామని నిక్కీ తెలిపారు. మత స్వేచ్ఛ ప్రాముఖ్యతను చాటి చెప్పేందుకు గురువారం పర్యటనలో భాగంగా వివిధ మతాలకు చెందిన పవిత్ర స్థలాలను ఆమె సందర్శించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment