'మా దేశానికి ఉగ్రముప్పు లేదు'
వాషింగ్టన్: అమెరికాపై ప్రస్తుతానికైతే ఎటువంటి ఉగ్రవాద సంస్థలు దాడిచేసేలా కనిపించడం లేదని ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. దేశ నిఘా విభాగం, ఇతర వర్గాల సమాచారం మేరకు ప్రస్తుతానికి ఎలాంటి దాడులు జరిగే సూచనలు కనిపించడం లేదన్నారు. వర్జీనియాలోని నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్లో యూఎస్ సెక్యూరిటీ అధికారులతో గురువారం సమావేశమయ్యారు. అనంతరం ఉగ్రముప్పు అంశంపై మాట్లాడారు. ఉగ్రవాదుల దాడి సూచనలు కనిపించనప్పటికీ, దేశమంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఉగ్రవాదుల టార్గెట్ అమెరికా అయినట్లయితే... వారికి ఇక కష్టాలు తప్పవంటూ హెచ్చరించారు. వ్యక్తిగతంగా, చిన్న చిన్న కార్యకలాపాల ద్వారా ఉగ్రదాడులు చేస్తే వాటిని అరికట్టడం కష్టసాధ్యమని చెప్పారు. అమెరికాను ఉగ్రదాడులకు దూరంగా ఉంచడానికి అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని, సిరియా, ఇరాక్ లలో ఉన్న ఐఎస్ఐఎల్ పై ఎన్నడు లేని విధంగా దాడి జరపాలన్నారు. ఆ దేశాల నేతలతో కూడా ఈ విషయంపై చర్చించినట్లు చెప్పారు. కాలిఫోర్నియా కాల్పుల ఘటనను దృష్టిలో ఉంచుకుని విదేశాల నుంచి అమెరికాకు వచ్చే శరణార్థులలో ఉగ్రవాదులు ఉండే అవకాశం ఉన్నందున బయో మెట్రిక్ విధానం ప్రవేశపెట్టి ఐఎస్ఎస్ ఉగ్రవాదులకు అడ్డుకట్ట వేస్తామన్నారు.