మాజీ అధ్యక్షుడిపై నాలుగోసారి నాన్ బెయిలబుల్..
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషరఫ్ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంటును ఇస్లామాబాద్ స్థానిక కోర్టు జారీచేసింది. అబ్దుల్ రషీద్ ఘాజీ అనే మతగురువు హత్య కేసు శనివారం కోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా కేసును విచారించిన మేజిస్ట్రేట్ మాజీ సైన్యాధ్యక్షుడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేస్తూ తీర్పిచ్చారు. అబ్దుల్ రషీద్ 2007లో మిలిటరీ చర్యల్లో భాగంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. మార్చి 16లోగా ఆయనను కోర్టులో హాజరుపరచాలని స్థానిక కోర్టు తన తీర్పులో పేర్కొంది. తనను ఈ కేసు నుంచి పూర్తిగా తప్పించాలని, తనకేం సంబంధం లేదంటూ ముషారఫ్ దాఖలు చేసిన పిటీషన్ ను మేజిస్ట్రేట్ కొట్టిపారేశారు. ఇప్పటివరకు జరిగిన 55 విచారణలలో ఒక్కసారి కూడా మాజీ అధ్యక్షుడు కోర్టుకు రాలేదని ధర్మాసనం మండిపడింది. కాగా, ప్రస్తుత వారెంట్ ముషారఫ్ పై జారీ అయిన నాలుగో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ కావడం గమనార్హం.
2006లో అక్బర్ బుగ్తీ హత్యకేసులో ఆయనను పోలీసులు గురువారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ముషరఫ్కు న్యాయస్థానం రెండువారాల జ్యూడిషియల్ కస్టడీ విధించింది. కాగా ముషారఫ్‌ను చంపితే వందకోట్ల రూపాయలిస్తానని బలూచిస్తాన్ నేషనలిస్ట్ నాయకుడు నవాబ్ అక్బర్ బుగ్తీ కుమారుడు తలాల్ అక్బర్ బుగ్తీ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. 2007లో ముషారఫ్ ఆదేశాల మేరకు రషీద్ ను మిలిటరీ హతమార్చిందని ఆయన కుటుంబసభ్యులు 2013లో మాజీ అధ్యక్షుడిపై ఫిర్యాదు చేశారు. అయితే, అప్పటి నుంచి ఈ కేసు విచారణలో పెద్దమార్పు లేనప్పటికీ పదుల సంఖ్యలో విచారణ కొనసాగినట్లు తెలుస్తోంది.