ప్యాంగ్‌యాంగ్: దాయాది దేశం దక్షిణ కొరియాపై సైనిక చర్య చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలనే ఆదేశాలను తమ సుప్రీంలీడర్ కిమ్ జోంగ్ ఉన్ నిలిపివేసినట్లు ఉత్తర కొరియా మీడియా బుధవారం వెల్లడించింది. మంగళవారం నాటి మిలిటరీ అధికారుల సమావేశంలో ఈ మేరకు ఆయన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే ఇందుకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. కాగా ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం సాగించడం ఆపకపోతే సైనిక చర్య తప్పదని కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ దక్షిణ కొరియాను హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇందుకోసం సైన్యానికి పూర్తి నిర్ణయాధికారం కట్టబెట్టామని ఆమె ప్రకటించారు. ఈ క్రమంలో ఉమ్మడి భాగస్వామ్యంతో సరిహద్దులో నెలకొల్పిన కేసంగ్ పారిశ్రామిక ప్రాంతంలోని అనుసంధాన కార్యాలయాన్ని ఉత్తర కొరియా గత మంగళవారం పేల్చివేసింది. (సైన్యానికి ఆదేశాలు జారీ చేశాను: కిమ్ సోదరి)
ఈ పరిణామాల నేపథ్యంలో కిమ్ తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే సైనిక చర్యలను రద్దు చేస్తామని కిమ్ ప్రకటించలేదని.. కేవలం సోదరి ఆదేశాలను నిలిపివేయడం ద్వారా ఆమె ఆధిపత్యానికి చెక్ పెట్టడానికే ఆయన ఇలా వ్యవహరించి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా కిమ్ ఆదేశాలతో.. ఉభయ కొరియాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. దక్షిణ కొరియా వ్యతిరేక ప్రచారాన్ని ఉధృతం చేసేందుకు సరిహద్దులకు తరలించిన లౌడ్‌స్పీకర్లను ఉ. కొరియా వెనక్కి తీసుకువెళ్తున్నట్లు సమాచారం.
మరోవైపు.. కిమ్ సోదరి కిమ్ యో జాంగ్ హెచ్చరికలపై ఘాటుగా స్పందించిన దక్షిణ కొరియా.. ఉత్తర కొరియా దుందుడుకు చర్యలు, అనాలోచిత వ్యాఖ్యాలను ఇకపై సహించబోమని స్పష్టం చేసింది. ఇక.. కిమ్‌కు వ్యతిరేకంగా దక్షిణ కొరియా మానవ హక్కుల కార్యకర్తలు, వారిని ప్రోత్సహిస్తున్న దాయాది దేశానికి బుద్ధి చెబుతామని.. ఇందుకోసం ‘యాంటీ- సౌత్ లీఫ్లెట్ క్యాంపెయిన్’ చేపట్టినట్లు ఉత్తర కొరియా పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దక్షిణ కొరియా తీరును నిరసిస్తూ రాయించిన లక్షలాది కరపత్రాలను బెలూన్లలో నింపి ఆ దేశంలో వదిలేందుకు సిద్ధమైంది.(ఉత్తర కొరియా దుందుడుకు చర్య.. ఉద్రిక్తత!)
Comments
Please login to add a commentAdd a comment