న్యూయార్క్: ‘‘తన పనిని తాను చేయాలని భావించింది. కానీ అదే ఆమె ప్రాణాలు బలిగొంది’’అంటూ ఓ మహిళా వైద్యురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురు నిజమైన హీరో కాబట్టి.. ఆమె ప్రశంసలు అందుకునేందుకు అర్హురాలని ఉద్వేగానికి లోనయ్యారు. అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్‌పై కరోనా వైరస్(కోవిడ్-19)పంజా విసురుతున్న విషయం విదితమే. మహమ్మారి కారణంగా ఇప్పటికే అక్కడ 16 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. మృతదేహాలను పూడ్చేందుకు కూడా సరిపడా స్థలం లేకపోవడంతో బ్రాంక్స్ వంటి ప్రాంతాల్లో శవపేటికలు ఒకదానిపై ఒకటి పేర్చి ఖననం చేసిన దృశ్యాలు అందరి హృదయాలను ద్రవింపజేశాయి. (కుప్పలుగా శవాలు.. అక్కడే ఎందుకు ఎక్కువ మరణాలు?)
ఇక అమెరికాలో కొన్నిచోట్ల వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుండగా.. న్యూయార్క్‌లో లక్షలాది మంది ప్రాణాంతక వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోవిడ్-19 పేషెంట్లకు సేవలు అందిస్తున్న డాక్టర్ లార్నా ఎం. బ్రీన్ చలించిపోయారు. ఆస్పత్రిలో లేదా ఇంట్లో ఉన్నా ఎల్లప్పుడు రోగుల బాగోగుల గురించి ఆలోచించే ఆమె.. తాను చికిత్స అందించిన కరోనా పేషెంట్లు చనిపోవడం తట్టుకోలేక ఆదివారం బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆమె తండ్రి డాక్టర్ ఫిలిఫ్ సి. బ్రీన్ వెల్లడించారు. మన్‌హట్టన్ న్యూయార్క్ అలెన్ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ విభాగం మెడికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న లార్నా(49) చనిపోయారని తెలిపారు. (ఎన్నికల వాయిదా సమస్యే లేదు: ట్రంప్)
తనకు ఎలాంటి మానసిక అనారోగ్యం లేదని.. ఈ విపరీత చర్యకు పాల్పడే ముందు తనతో మాట్లాడిందని... అంబులెన్సులో ఎక్కించడానికి ముందే ఎంతో మంది పేషెంట్లు మృతి చెందడం తనను వేదనకు గురిచేస్తుందని చెప్పిందని ఫిలిప్ పేర్కొన్నారు. పేషెంట్లకు సేవలు అందిస్తున్న సమయంలో తన కూతురికి కూడా కరోనా సోకిందని.. అయినప్పటికీ ఎంతో ధైర్యంగా మహమ్మారితో పోరాడి తిరిగి విధుల్లో చేరిందని గుర్తుచేసుకున్నారు. ఇక ఆస్పత్రి వర్గాలు లార్నా మృతికి గల కారణాలు తమకు అంతుపట్టడం లేదని న్యూయార్క్ టైమ్స్‌కి తెలిపారు. లార్నా ఎంతో ప్రతిభ గలవారని.. తక్కువ సమయంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారని ప్రశంసించాయి. తనెప్పుడూ ఇతరుల గురించే ఆలోచిస్తారని.. కోవిడ్ బారిన పడిన సమయంలో కూడా ఇంట్లో నుంచి తమకు మెసేజ్‌లు చేస్తూ రోగుల క్షేమసమాచారం అడిగి తెలుసుకునే వారని ఆమె సహచర ఉద్యోగులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment