వాషింగ్టన్ : కన్నబిడ్డ కాసేపు కనిపించకపోతేనే తల్లడిల్లుతాం. అదే ఉన్నత చదువుల కోసం ఆడబిడ్డను కాస్త దూరంగా పంపాలంటే ఏ తండ్రి కళ్లయినా చెమ్మగిల్లుతాయి. దేశానికి రాజు అయినా... తండ్రి మమకారం విషయంలో మాత్రం అతడు మామూలు వ్యక్తే. ఇందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా మినహాయింపు కాదు. ప్రపంచంలోనే అగ్రరాజ్యానికి అధినేత అయిన ఒబామా తన పెద్ద కూతురు మాలియాను ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాలకు పంపించే విషయమై ఇప్పటినుంచే ఆందోళన చెందుతున్నారు. బిడ్డను విడిచి దూరంగా ఎలా ఉండాలా అని భావోద్వేగానికి లోనవుతున్నారు.
16 ఏండ్ల మాలియా ఇప్పుడు 11 గ్రేడ్ చదువుతోంది. మరికొన్ని నెలల తర్వాత ఆమె కాలేజీ చదువుల కోసం దూరప్రాంతాలకు వెళ్లే అవకాశముంది. అయితే, ఆ సందర్భంలోని తీపిని, చేదును ఎదుర్కోవడానికి గత రెండేళ్లుగా తాను భావోద్వేగంగా సన్నద్ధమవుతున్నట్టు ఒబామా చెప్పారు. ఇటీవల మస్సాచుసెట్స్ హైస్కూల్ గ్రాడ్యుయెట్స్‌తో మాట్లాడిన ఆయన ‘ఆ సందర్భంలో భావోద్వేగానికి లోనవ్వకుండా, ఏడ్వకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను. ఆమెను ఇబ్బందిపెట్టను. అది నా పరీక్షా సమయమే’ అని పేర్కొన్నారు. ఇప్పటికే తండ్రి అంత ఎత్తు పెరిగిన మాలియా గతకొన్ని రోజులుగా స్టాన్‌ఫోర్డ్, కాలిఫోర్నియా యూనివర్సిటీల్లో పర్యటిస్తున్నది. ఈ రెండు వర్సిటీలో ఒబామా కుటుంబం నివాసముంటున్న వైట్‌హౌస్‌కు చాలా దూరం. అన్నట్టు స్టాన్‌ఫోర్డ్ యూని వర్సిటీలోనే అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ బిడ్డ చెల్సియా చదువుకుంది.
కూతురు గురించి బెంగపడుతున్న ఒబామా
Published Thu, Jul 31 2014 9:00 AM | Last Updated on Fri, Nov 9 2018 4:53 PM
Advertisement
Advertisement