‘ఐఎస్’ను అంతంచేస్తాం: ఒబామా
ఐరాస: ఇరాక్, సిరియాల్లో ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాద సంస్థ నిర్మించిన ‘మృత్యు వ్యవస్థ’ను విచ్ఛిన్నం చేసి తీరుతామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. అందుకు అమెరికా తన సైనిక సంపత్తిని ఉపయోగిస్తుందన్నారు. ఐఎస్ ఉగ్రవాదుల సిద్ధాంతాల్ని నిర్ద్వంద్వంగా, నిష్కర్షగా తిరస్కరించాలని ముస్లింలకు పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో బుధవారం ఒబామా ప్రసంగించారు. ఐఎస్‌ను అంతమొందిం చడంలో కీలక భాగస్వామిగా వ్యవహరిస్తామని ఈ సందర్భంగా ఒబామా స్పష్టం చేశారు.
ఇద్దరు అమెరికా జర్నలిస్టులు, ఒక బ్రిటన్ జాతీయుడిని ఐఎస్ ఉగ్రవాదులు దారుణంగా తలనరికి చంపిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. ‘వారి దారుణాలను ఏ దేవుడూ క్షమించడు. ఈ మృత్యు వ్యవస్థను నాశనం చేసేందుకు విస్తృత అంతర్జాతీయ సంకీర్ణంతో కలసి అమెరికా కృషిచేస్తుంది’ అని చెప్పారు. ఇందులో ప్రపంచదేశాలన్నీ కలసిరావాలని కోరారు. ‘ఇస్లాం’తో యుద్ధం చేయడం అమెరికా విదేశాంగవిధానం కాదని ఒబామా స్పష్టం చేశారు.