లాహోర్ : పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్లో బుధవారం తెల్లవారుజామున పోలీసులకు తీవ్రవాదులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఏడుగురు తీవ్రవాదులు మరణించారు. ఈ మేరకు తీవ్రవాద వ్యతిరేక విభాగానికి చెందిన పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. లాహోర్ సమీపంలోని షారుఖ్పుర్ వద్ద 12 మంది తీవ్రవాదులను పోలీసులు గుర్తించారు. ఆ విషయాన్ని గమనించిన తీవ్రవాదులు పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఏడుగురు తీవ్రవాదులు మృతి చెందగా.... మరో ఐదుగురు తీవ్రవాదులు మాత్రం చీకట్లో పరారైయ్యారని చెప్పారు. మృతదేహాల వద్ద నుంచి 2 కేజీల పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మృతి చెందిన తీవ్రవాదులంతా తెహ్రీక్- ఈ- తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) , లష్కర్ - ఈ- జంగ్వీ (ఎల్ఈజే) సంస్థలకు చెందినవారని పేర్కొన్నారు.
చార్సద్దా పట్టణంలో యూనివర్సటి తీవవ్రాదులు దాడి చేశారు. ఈ దాడిలో 21 మంది మరణించిన సంగతి తెలిసిందే. వారిలో విద్యార్థులే అధికంగా ఉన్నారని వెల్లడించారు.