‘భారత్, అఫ్ఘనిస్థాన్ జాగ్రత్తగా ఉండాలి’
న్యూయార్క్: భారత్, అఫ్ఘనిస్థాన్‌లను అమెరికా హెచ్చరించింది. పాకిస్థాన్ ఉగ్రవాదులతో ఈ రెండు దేశాలు జాగ్రత్తగా ఉండాలని, వారు ఎప్పుడైనా దాడి చేసే ప్రమాదం ఉందని అమెరికా నిఘా సంస్థలు స్పష్టం చేశాయి. అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం డైరెక్టర్ డానియెల్ కోట్స్ సెనేట్ సెలక్ట్ కమిటీ సభ్యులతో నిఘాకు సంబంధించిన విషయాలు మాట్లాడుతూ ‘తమ దేశంలోని ఉగ్రవాదులను నిలువరించడంలో పాక్ విఫలమైంది. ఈ గ్రూపులు అమెరికాకు కూడా ప్రమాదకరంగా మారాయి. ఎప్పుడెప్పుడు దాడులు చేద్దామా అని ఎదురుచూస్తున్నాయి. భారత్, అప్ఘనిస్థాన్‌పై దాడులు చేసేందుకు ఉగ్రవాదులు ప్రణాళికలు రచిస్తున్నారు’ అని ఆయన చెప్పారు.
భారత్-పాక్ సంబంధాల విషయంలో పాక్ నిర్లక్ష్యం వహిస్తుందని, ఇంకోసారి ఇరు దేశాల సరిహద్దు వద్ద పాక్ ఉగ్రవాదుల కారణంగా ఎలాంటి పెద్ద దాడి జరిగినా కచ్చితంగా ఆ దేశంతో తమకు ఉండే సంబంధాలు దెబ్బతింటాయని స్పష్టం చేశారు. తమ దేశంలో ఉగ్రవాదులను ఏరివేయాల్సిన అవసరం ఉందని పాక్‌కు హెచ్చరించారు. సీమాంతర ఉగ్రవాదం అస్సలు ప్రోత్సహించరాదని అన్నారు.