
ఉగ్రమూకలను అంతం చేయాలి!
పాక్‌లోని ఉగ్ర వ్యవస్థలపై ఆ దేశానికి ఒబామా విస్పష్ట సందేశం
♦ పఠాన్‌కోట్ దాడి క్షమార్హం కాని ఉగ్ర చర్య
♦ భారత్, అమెరికాలది ఈ శతాబ్ది భాగస్వామ్యం
వాషింగ్టన్: పాకిస్తాన్ భూభాగం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద సంస్థలను సమూలంగా నాశనం చేయాల్సిన బాధ్యత పాక్ ప్రభుత్వంపై ఉందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. ‘దేశంలోని ఉగ్రసంస్థలను అంతం చేయడానికి సంబంధించి పాక్ మరింత కఠిన చర్యలు తీసుకోవాలి.. తీసుకోగలదు. పాక్‌పై నాకు నమ్మకముంది’ అన్నారు. ‘చాన్నాళ్లుగా భారత్ ఎదుర్కొంటున్న ‘క్షమార్హంకాని ఉగ్రవాదా’నికి మరో ఉదాహరణ పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడి’ అన్న ఒబామా.. పాక్ గడ్డపైనున్న ఉగ్రవాద వ్యవస్థలను నిషేధించి, వాటి కార్యకలాపాలను అడ్డుకుని, నిర్వీర్యం చేయాని తేల్చిచెప్పారు. ఈ విషయంలో చిత్తశుద్ధి చూపేందుకు పాక్‌కు ఇదే సమయమని పీటీఐకి ఆదివారమిచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. భారత్-యూఎస్ సంబంధాలు, ఉగ్రవాదం, తదితరాలపై ఆయననేమన్నరంటే.
► స్వదేశంలో ఉగ్రవాదులకు, ఉగ్ర సంస్థలకు సహకరించడాన్ని పాక్ ఎట్టిపరిస్థితుల్లో సహించకూడదు. పఠాన్‌కోట్ దాడుల తర్వాతద పాక్ ప్రధానితో సంప్రదింపుల విషయంలో భారత ప్రధాని మోదీ ప్రశంసనీయ చొరవ చూపారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాద నిర్మూలకపై చర్చల్లో ఇద్దరూ ముందడుగు వేస్తున్నారు.
► పాక్‌లో అభద్రత ఆ దేశానికి, ఆ ప్రాంతానికి ప్రమాదకరమని షరీఫ్ గుర్తించారు. పెషావర్ సైనిక పాఠశాలపై పాశవిక ఉగ్రదాడి అనంతరం తరతమ తేడా చూపకుండా అన్ని ఉగ్రసంస్థల అంతానికి ప్రతిన బూనారు. అదే సరైన మార్గం. ఆ తరువాత పాక్‌లోని కొన్ని ఉగ్రసంస్థలపై షరీఫ్ చర్యలు తీసుకోవడం చూశాం.
► ఈ శతాబ్దపు నిర్ణయాత్మక భాగస్వామ్యాల్లో భారత్, అమెరికాలది ఒకటి. మాతో దృఢ భాగస్వామ్యం కావాలని మోదీ బలంగా కోరుకున్నారు. అందులో భాగంగానే మా రెండు కార్యాలయాల మధ్య సురక్షిత హాట్‌లైన్ ఏర్పాటైంది. ద్వైపాక్షిక సంబంధాల పూర్తిస్థాయి ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. నా భారత పర్యటనతో పరస్పర సహకారంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది.
► రైతు, సంక్షేమం, అందరికీ విద్యుత్తు, పేదరిక నిర్మూలన తదితరాల్లో విశ్వసనీయ భాగస్వాములుగా భారత్, అమెరికాలు రూపొందాయి.