పాక్ లో మతం మారితే శిక్ష ఉండదట!
ఇస్లామాబాద్(పాకిస్తాన్): శిక్ష పడకుండా ఉండాలంటే మతం మారాలని పాకిస్తాన్‌కు చెందిన ఓ ప్రాసిక్యూటర్ చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఓ హత్య కేసులో నిందితులుగా ఉన్న 45 మంది క్రైస్తవులు మతం మారితే చాలు..శిక్ష మాఫీ అవుతుందని సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హెచ్చరించటం కలకలం రేపుతోంది. లాహోర్‌లోని క్రైస్తవులు అధికంగా నివసించే యోహనాబాద్ ప్రాంతంలో 2015లో అల్లర్లు చెలరేగాయి. స్థానికంగా ఉన్న రెండు చర్చిల్లో ఆదివారం ప్రార్థనల సందర్భంగా ఆత్మాహుతి దాడులు జరిగాయి. దాడుల అనంతరం కోపోద్రిక్తులైన క్రైస్తవులు జరిపిన దాడుల్లో ఇద్దరు ముస్లింలు చనిపోయారు.
ఈ ఘటనకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు శిక్ష నుంచి తప్పించుకోవాలంటే ముస్లింలుగా మారాలంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సయ్యద్ అనీస్ తనకు చెప్పారని నిందితుల లాయర్ జోసెఫ్ ఫ్రాన్సి వెల్లడించారు. వారు గనుక మతం మార్చుకుంటే శిక్ష నుంచి బయటపడటానికి తాను గ్యారెంటీదారుగా ఉంటానన్నారన్నారు. అయితే, నిందితులు దీనిపై మౌనంగా ఉన్నారని ఆయన చెప్పారు. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉన్న నిందితులను బ్లాక్‌మెయిలింగ్ చేయటం ఎంతవరకు సబబన్నారు. ఇటువంటి చర్యల ద్వారా దేశానికి చెడ్డపేరు తెస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై సయ్యద్ అనీస్ స్పందిస్తూ.. నిందితులను మతం మారాలని తాను కోరలేదని, వారికి శిక్ష నుంచి బయటపడేందుకు ఒక అవకాశం ఉందని మాత్రమే అన్నానన తెలిపారు. తమను బలవంతంగా ఇస్లాంలోకి మార్చుతున్నారంటూ క్రైస్తవులు గతంలో పలుమార్లు ఫిర్యాదులు చేస్తున్నా.. ఏకంగా ఒక ప్రభుత్వ అధికారిపై ఇటువంటి ఆరోపణలు రావటం మాత్రం ఇదే ప్రథమమని భావిస్తున్నారు.