200 ఆపరేషన్లు.. 600మంది ఉగ్రవాదులు అరెస్ట్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ 600మంది అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసింది. లాహోర్‌లో జరిగిన బాంబు దాడి అనంతరం సీరియస్‌గా ఉగ్రవాదుల వేట ప్రారంభించిన పాక్ ఇప్పటి వరకు పంజాబ్ ప్రావిన్స్‌లో మొత్తం 200 సెర్చింగ్ ఆపరేషన్లు నిర్వహించిందని, ఇందులో 600 మంది అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసిందని పాక్ ఆర్మీ ప్రకటించింది. గత వారం పాక్ ఆర్మీ ఆపరేషన్ రాద్ ఉల్ ఫసాద్ పేరిట(తుడిచివేయుట, పడేయుట, గెంటివేయుట అని అర్థం) గాలింపు చర్యలు ప్రారంభించింది.
సింద్ ప్రావిన్స్‌లోని ఓ మసీదుపై ఉగ్రవాదులు దాడులు చేయడంతో దాదాపు 125మంది పౌరులు చనిపోయిన విషయం తెలిసిందే. వీరిలో 91మంది షియాలే ఉన్నారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని కారోర్ లయ్యాహ్, రావల్పిండి తదితర ప్రాంతాల్లో 200 చోట్ల దాడులు నిర్వహించామని, అనుమానితులను అరెస్టు చేసినట్లు తెలిపింది. నివాసాలు, అనుమానిత ప్రార్థనా స్థలాలు, దుకాణాలు, షాపింగ్ మాల్స్ వేటిని విడిచిపెట్టకుండా సోదాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు కూడా పాక్ ఆర్మీ పేర్కొంది.