పారిస్పై ఉగ్రపంజా
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 9 గంటలకు (భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారు జామున 3 గంటలకు) పారిస్ నగరంలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కాల్పులు, పేలుళ్లు సంభవించాయి. ఈ సంఘటనల్లో ఇప్పటివరకు దాదాపు 150 మంది చనిపోయినట్లు సమాచారం. మరో 300 మందికిపైగా గాయపడగా, పలువురిని ఉగ్రవాదులు బందీలు చేసుకున్నట్లు తెలిసింది.
లెవెన్త్ డిస్ట్రిక్ట్ లోని ఓ రెస్టారెంట్ లోకి చొరబడ్డ ఓ దుండగుడు ఇష్టారీతిగా కాల్పులు జరిపి కొద్దిమందిని బందీలుగా చేసుకున్నాడని మొదట వార్తలు వెలువడ్డాయి. కొద్దిసేపటికే బటాక్లాన్ ఆర్ట్ సెంటర్ ప్రాంతంలోనూ కాల్పులు జరిగాయని పోలీసులకు సమాచారం అందింది. అంతలోనే ఓ బార్ లో పేలుడు జరిగినట్లు తెలిసింది. జర్మన్లు అధిక సంఖ్యలో వచ్చే ఈ బార్ ను ఉగ్రవాదులు ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
కాల్పుల కలకలంతో ఉలిక్కిపడ్డ ఫ్రాన్స్ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ఓ మ్యాచ్ ను వీక్షిస్తున్న దేశాధ్యక్షుడు ఫ్రాన్స్ కోయిస్ హోలాండ్ ను హుటాహుటిన సురక్షితప్రాంతానికి తరలించారు. కనీసం 10 మంది రోడ్డుపై చనిపోయి ఉండటాన్ని గమనించానని, కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని రెస్టారెంట్ లో చిక్కుకుపోయిన బీబీసీ జర్నలిస్ట్ ఒకరు సమాచారం అందించారు. మొత్తం ఆరుగురు సాయుధులు నగరంలోకి చొరబడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కొద్ది నెలల కిందట పారిస్ లోని చార్లీ హెబ్డో పత్రికా కార్యాలయంపై ఉగ్రవాదులు దాడి, ఆ తరువాత రెండు మూడు సార్లు కాల్పుల ఉదంతాలతో ఉగ్రవాదులు పారిస్ ను లక్ష్యం చేసుకున్నారనే అనుమానాలు బడపడిన సంగతి తెలిసిందే. తాజా రక్తపాతం ఆ అనుమానాలను మరింత బలపర్చినట్లయింది.