దూసుకొస్తోంది.. డ్రోన్ల దండు! | Pentagon Demonstrates Swarm of Over Drones | Sakshi
Sakshi News home page

దూసుకొస్తోంది.. డ్రోన్ల దండు!

Published Thu, Jan 12 2017 8:37 PM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM

దూసుకొస్తోంది.. డ్రోన్ల దండు! - Sakshi

దూసుకొస్తోంది.. డ్రోన్ల దండు!

సరికొత్త అస్త్రం రూపొందిస్తున్న అమెరికా
కృత్రిమ మేధస్సు (ఐఏ)తో నడిచే డ్రోన్ల దండు
స్వయంగా నిర్ణయించుకుంటూ పని పూర్తి
ప్రయోగం వివరాలు వెల్లడించిన పెంటగన్‌


ఆయుధం.. యుద్ధంలో అత్యంత కీలకం. చేతులు, కర్రల నుంచి కత్తులు, డాళ్లకు.. తుపాకులు, తూటాలకు.. రైఫిళ్లు, మర ఫిరంగులకు.. యుద్ధ విమానాలు, క్షిపణులకు.. చివరికి అణ్వస్త్రాల వరకూ ఆయుధాలు అభివృద్ధి చెందాయి. ఆయుధాల పరిణామంలో అణ్వస్త్రమే ఇప్పటివరకూ అతి పెద్ద విప్లవం. అణ్వాయుధాల తయారీకి అగ్రదేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలూ ఏళ్ల తరబడి పోటీపడ్డాయి. ఒక దానిని మించి మరొకటి అణ్వస్త్రాలను పోగుచేసుకున్నాయి. ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య సరికొత్త ఆయుధ పోటీ మొదలవుతోంది. అణ్వస్త్రం తర్వాత అతిపెద్ద విప్లవం ఇదేనని చాలా మంది రక్షణరంగ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అది.. డ్రోన్ల దండు! కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ - ఏఐ)తో కూడిన డ్రోన్ల దండు!! అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్‌ తదితర అగ్ర రాజ్యాలు ఈ డ్రోన్ల దండును అభివృద్ధి చేసే పనిలో తలమునకలై ఉన్నాయి. అమెరికా రక్షణ సంస్థ పెంటగన్‌ గత ఏడాది డ్రోన్ల దండు ఆయుధాన్ని పరీక్షించిన విషయాన్ని ఇటీవలే వెల్లడించింది.

(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)
రక్షణ రంగంలో గత పదిహేనేళ్లలో డ్రోన్ల వినియోగం ఒక విప్లవం. వైమానిక దాడులు చేయడం నుంచి మందుపాతరలను నిర్వీర్యం చేయడం వరకూ యుద్ధరంగంలో చాలా పనులకు డ్రోన్లను ఉపయోగించడం పెరిగింది. మనుషులు కమాండ్‌ సెంటర్‌లో కూర్చుని ఆపరేట్‌ చేస్తోంటే మానవరహిత డ్రోన్లు పనులు చక్కపెడుతుంటాయి. ఇప్పుడు ఒక కొత్త తరం డ్రోన్లు వస్తున్నాయి. అవి స్వయంగా నిర్ణయం తీసుకుంటాయి. మనుషులు నియంత్రించకుండా తమకు తాముగానే అవి పనులు చక్కబెడతాయి. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ పరిస్థితులకు తగ్గట్లుగా వ్యవహరిస్తాయి. పైగా చాలా చాలా చిన్న చిన్న డ్రోన్లు ఒక దండులాగా కదలివస్తాయి.

సొంత మెదడుతో పనిచేస్తాయి
తేనె తుట్టెను కదిలించినపుడు.. వందల సంఖ్యలో తేనెటీగల దండు దాడి చేయడం మనకు తెలుసు. మైక్రో డ్రోన్ల దండు కూడా ఇలాగే పదులు, వందల సంఖ్యలో ఒకేసారి చుట్టుముడతాయి. ఈ దండుకు ఒకే మెదడు (ఏఐ) ఉంటుంది. అంటే దండులోని డ్రోన్లు భౌతికంగా విడివిడిగా ఉన్నా సాంకేతికంగా ఒకే మెదడుకు అనుసంధానమై ఉంటాయి. కమాండ్‌ సెంటర్‌లో ఉండే ఆ మెదడుకు ఆపరేటర్‌ ఒక ఆదేశం ఇచ్చి వదిలేస్తాడు. ఇక ఆ పని ఎలా పూర్తి చేయాలన్నది డ్రోన్ల దండు సమన్వయంతో నిర్ణయించుకుంటూ ప్రయాణిస్తాయి. చివరికి వాటికి ఆదేశాలిచ్చిన సాంకేతిక నిపుణుడు కూడా వాటి ప్రయాణ మార్గాన్ని నింయత్రించలేడు.


పెంటగాన్‌ పెర్డిక్స్‌ ప్రయోగం
అమెరికా రక్షణ సంస్థ పెంటగన్‌ గత ఏడాది అక్టోబర్‌లో కాలిఫోర్నియా రాష్ట్రంలోని చైనా లేక్‌ ప్రాంతంలో డ్రోన్ల దండును ప్రయోగాత్మకంగా పరిశీలించింది. ‘పెర్డిక్స్‌’గా పిలిచే 104 చిన్న చిన్న  డ్రోన్లతో కూడిన దండును ఎఫ్‌-18 విమానాల నుంచి ప్రయోగించింది. (అంతకుముందు ఏడాది అలాస్కాలో 20 డ్రోన్ల దండును పరీక్షించింది.) ఈ డ్రోన్ల దండుకు మూడు చదరపు మైళ్ల ప్రాంతాన్ని గస్తీ కాయాలని మనుషులు ఆదేశాలిచ్చారు. ఆ పనిని ఎలా నిర్వహించాలనేది డ్రోన్ల దండు స్వయంగా విశ్లేషించుకుంటూ నిర్వర్తించింది. ఈ పరీక్షకు సంబంధించి తాజాగా విడుదల చేసిన వీడియోలో.. మెరైన్‌ కెప్టెన్‌ ఇచ్చిన ఆదేశాలను అమలుచేయడానికి ఈ డ్రోన్లు తమకు తాముగా వివిధ రూపాల్లో వరుసల్లో చేరడం కనిపించింది. ‘ఇది భవిష్యత్‌ యుద్ధ రీతికి ఒక మచ్చుతునక’ అని డాక్టర్‌ విలియం రోపర్‌ అభివర్ణించారు.


ఖర్చు తక్కువ.. లాభమెక్కువ
 భారీస్థాయి యుద్ధవిమానాలు, యుద్ధనౌకలను ఉత్పత్తి చేయడం, వాటిని నిర్వహించడం ఎంతో వ్యయ ప్రయాసలతో కూడిన వ్యవహారం. ఏటా లక్షల కోట్ల డాలర్లు ఇందుకోసం వ్యయం చేయాల్సి వస్తోంది. కానీ డ్రోన్ల ఉత్పత్తి చాలా చౌక. నిర్వహణ కూడా చాలా సులభం. మనుషుల ప్రమేయం కూడా తక్కువే. యుద్ధరంగంలో వ్యూహాత్మక పైచేయి సాధించడమూ సులభం. అసలు యుద్ధరంగంలో మనుషుల బదులు.. కృత్రిమ మేధస్సు గల రోబోలు, డ్రోన్లే సైనికులుగా పోరాడే రోజు మరెంతో దూరంలో లేదని ఈ రంగంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తల మాట.


ఆల్గరిథమ్స్‌.. 3డీ ప్రింటింగ్‌
పెర్డిక్స్‌ అనేది గ్రీకు పురాణాల్లో కనిపించే ఒక పక్షి పేరు. అరచేతిలో ఇమిడిపోతుంది. పిల్లలు ఆడుకునే ఒక బొమ్మ లాగా ఉంటుంది. దండులోని డ్రోన్లు ఒక దానితో మరొకటి ఢీకొట్టకుండా నిరోధించటం కోసం వేగంగా అభివృద్ధి చేస్తున్న కంప్యూటర్‌ ఆల్గరిథమ్స్‌ సాంకేతికతను వీటిలో ఉపయోగించారు. అయితే.. వాణిజ్యపరంగా దుకాణాల్లో లభ్యమయ్యే మామూలు పరికరాలతోనే వీటిని తయారు చేశారు. డ్రోన్‌ వెలుపలి బాడీని 3డీ ప్రింటింగ్‌తో రూపొందించడం మరో విశేషం. తక్కువ ఖర్చుతో ఎక్కువ డ్రోన్లను వేగంగా ఉత్పత్తి చేయడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నారు.


చిన్నవే కానీ.. చేసే పనులు ఎన్నో
‘ఇవి నిఘా కోసం తక్కువ ఎత్తులో ఎగురగలవు. ప్రత్యర్ధిని వ్యూహాత్మకంగా ముంచెత్తడానికి ఒకేసారి పెద్ద సంఖ్యలో ప్రయోగించవచ్చు. ఈ దండును ఎదుర్కోవడానికి ప్రత్యర్థి చాలా సమయాన్ని, డబ్బును వ్యయం చేయాల్సి వస్తుంది’ అని పెంటగన్‌లో స్ట్రాటజిక్‌ కాపబిలిటీస్‌ ఆఫీస్‌ డైరెక్టర్‌ విలియం రోపర్‌ పేర్కొన్నారు. శత్రువు వైమానిక బలగాన్ని అయోమయానికి గురిచేయడానికి, లేదా రాడార్‌ వ్యవస్థను జామ్‌ చేయడానికి కూడా వీటిని ఉపయోగించవచ్చు. యుద్ధరంగంలో ముందుకు కదిలేటపుడు ఎదుట శత్రువు ఆనుపానులు తెలుసుకుని హెచ్చరికలు పంపందుకు కూడా వీటిని ప్రయోగించవచ్చు.


రూపొందించింది ఎంఐటీ విద్యార్థులు
వాస్తవానికి పెర్డిక్స్ రూపకర్తలు ఎంఐటీ ఇంజనీరింగ్‌ విద్యార్థులు. 2011లోనే వారు దీనిని రూపొందించారు. ఇది పెంటగన్‌ను ఆకర్షించింది. దీంతో వీటిని సైనికంగా వినియోగించడం కోసం సాంకేతికతను అభివృద్ధి చేసే పనిలో గత మూడేళ్లుగా నిమగ్నమైంది. గత అక్టోబర్‌లో ఆరో తరం సాంకేతికతను సంతృప్తికరంగా పరీక్షించింది. అయితే.. ప్రస్తుతం ఈ డ్రోన్ల దండును ఒకసారి ప్రయోగించి వదిలివేయడం జరుగుతోంది. ప్రయోగించిన ఈ చిన్న డ్రోన్లు పని పూర్తయ్యాక.. తమను ప్రయోగించిన యుద్ధవిమానానికి తిరిగివచ్చే సాంకేతికతను ఇంకా అభివృద్ధి చేయలేదు. అలాగే.. ఈ డ్రోన్ల పరిధి కూడా పరిమితంగానే ఉంది. ఇది పూర్తిస్థాయిలో అభివృద్ధి చెంది యుద్ధరంగంలోకి రావవడానికి మరో మూడేళ్లు పట్టవచ్చని నిపుణులు చెప్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement