ఆ మొక్కలు నాటితే నష్టమే..
అడవులు నరికేయడం సులభమే... కానీ పెంచడం అంత తేలిక కాదు అంటున్నారు యూరోపియన్లు. ఎందుకంటే వారు చేపట్టిన అడవుల పెంపకంవల్ల లాభం కన్నా నష్టాలే ఎదురైనట్లు కనుగొన్నారు. ఫ్రాన్స్ అల్సాస్ ప్రాంత అడవుల్లో పాతిన మొక్కలవల్ల తీవ్ర వాతావరణ మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుసుకున్నారు. రీ ఫారెస్టేషన్ తో మరింత భూ తాపం పెరిగినట్లు పరిశీలకులు చెప్తున్నారు.
పర్యావరణంలో మార్పులు సంభవించడానికి అడవులు నరికేయడమే ప్రధాన కారణం అని ఇప్పటిదాకా మనకు తెలుసు. చెట్లు కార్పన్ ను పీల్చుకొని... ప్రాణవాయువును అందిస్తాయని... వాతావరణాన్ని, భూ తాపాన్ని సమతుల్యంగా ఉంచుతాయని తెలుసు. అందుకే చెట్లు నాటడం మంచిదని చెప్తారు. చెట్ల పెంపకం కోసం ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు కూడ చేపడతాయి. అయితే అడవుల నిర్వహణ అంత సులభం కాదని ఇటీవల వెల్లడైన పరిశోధనలు చెప్తున్నాయి. అడవుల పెంపకంతో ఎన్నో తలనొప్పులు కూడ ఎదురౌతున్నట్లు అధ్యయనకారులు అంటున్నారు. వాతావరణానికి అనుకూలంగా ఉండే చెట్లు నాటకపోవడం, చెట్ల ఎంపికలో సమస్యల వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోందని, భూతాపం మరింత పెరిగిపోయిందని తెలుసుకున్నారు.
యూరప్ లో అంతరించి పోతున్న అడవుల స్థానంలో తిరిగి పెంపకాన్ని చేపట్టి...2010 నాటికి 85 శాతం పూర్తి చేశారు. అయితే 250 ఏళ్ళలో ఎక్కువగా వాణిజ్యపరంగా విలువైన, త్వరగా పెరిగే, ప్రాణులకు అనువుగా ఉండే మొక్కలపైనే.. నిర్వహణాధికారులు దృష్టి పెట్టినట్లు చరిత్రను పరిశీలించిన అధ్యయన కారులు తెలుసుకున్నారు. ముఖ్యంగా అడవుల పెంపకంలో వాడిన మూడు జాతుల్లో ఓ జాతి మొక్కలకు ఎక్కువ స్థానం కల్పించారని, వాటిని సుమారు 4 లక్షల చదరపు మైళ్ళలో నాటారని చెప్తున్నారు.
కోనిఫర్ జాతికి చెందిన ఆ చెట్లు... అడవుల్లో లేతరంగు ఆకులున్న చెట్లుకన్నా ఎక్కువగా ఉండటమే కాక, చెట్లకు ఆకులకన్నా సూదుల్లాంటి ముళ్ళు కలిగి ఉన్నాయని....అవి సూర్య కాంతిని ఆకర్షించడంకంటే... వికిరణానికి తోడ్పడుతున్నట్లు తెలుసుకున్నారు. దీంతో ఈ అడవులున్న ప్రాంతంలో తీవ్ర ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, భూ తాపాన్ని తగ్గించే బదులు, పెరగడానికి కారణమౌతోందని ఓ సైన్స్ జర్నల్ లో పేర్కొన్నారు. మొక్కలు నాటడం ముఖ్యం కాదని, నాటే మొక్కలు పనికొచ్చేవా... కావా అన్నది తెలుసుకోవడం అవసరమని తాజా పరిశోధనలు చెప్తున్నాయి.