
పోలీసును పొడిచి చంపారు
ఢాకా: ఒకే రోజు రెండు చోట్ల పోలీసులపై దుండగులు జరిపిన దాడుల్లో ఒకరు మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగర శివారులోని అశులియా చెక్ పోస్ట్ వద్ద చోటుచేసుకుంది. నెల రోజుల్లో పోలీసులపై దాడి జరగడం ఇది రెండో సారి. పోలీసులు తెలిపిన వివరాలు.. బైక్లపై వచ్చిన ఏడుగురు దుండగులు పెట్రోలింగ్ చేస్తున్న పోలీసు వాహనం పై బుధవారం కాల్పులు జరిపారు. అనంతరం ఇద్దరిపై పెద్ద పెద్ద కత్తులతో దాడి చేశారు. వీరిలో కానిస్టేబుల్ ముకుల్ హోసైన్(23) మెడ భాగంలో పొడవగా, తీవ్రగాయాలతో ఆస్పత్రి తరలిస్తుండగా మృతి చెందాడు. మరో కానిస్టేబుల్ నూర్-ఈ-ఆలంకు తీవ్రగాయాలయ్యాయి, ప్రస్తుతం అతనికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు తూర్పు ఢాకాలో పోలీసులపై జరిగిన మరో దాడిలో ఐదుగురుకి గాయాలయ్యాయి. గుర్తు తెలియని దుండగులు పోలీసు వాహనంపై కాల్పులు జరపడంతో పోలీసులకు గాయాలయ్యాయి. గత నెల 21న ఎస్ఐని దుండగులు కత్తులతో పొడిచి చంపిన ఘటన మరువకముందే ఈ దారుణం చోటు చేసుకుంది.
ఈ దాడులను హోం మంత్రి అసదూజ్జమాన్ ఖాన్ కమాల్ ఖండించారు. ఇంతకుముందు పోలీసు అధికారులపై జరిపిన మిలిటెంట్ సంస్థే ఈ దాడికి కూడా పాల్పడి ఉండొచ్చని అన్నారు. దాడికి పాల్పడిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని తెలిపారు.