సెల్ఫీలు తీసుకుని అడ్డంగా బుక్కయ్యారు!
న్యూయార్క్: ఓ వైపు ఇళ్లు కాలి బూడిదైపోతుందని ఫ్యామిలీ ఏడుస్తుంటే.. మరోవైపు బాధ్యత గల పోలీసు అధికారులు మాత్రం నింపాదిగా సెల్ఫీలు తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యారు. ఈ ఘటన న్యూయార్క్ శివార్లలో గత గురువారం చోటుచేసుకుంది. టూ లాంగ్ ఐలాండ్ ఆఫీసర్ల చేష్టలపై అక్కడ సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో అన్ లైన్లో విపరీతంగా షేర్ కావడంతో ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. వీరిపై కచ్చితంగా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కమిషనర్ థామస్ క్రంప్టర్ తెలిపారు. వాషింగ్టన్ పోస్ట్ మీడియా శనివారం ఇచ్చిన కథనంతో పోలీసుశాఖలో కదలిక వచ్చింది.
ఈ ఘటనపై సంబంధిత కౌంటీ పోలీసు ఉన్నతాధికారి జేమ్స్ కార్వర్ ను మీడియా సంప్రదించగా ఆయన స్పందించలేదు. కెవన్ అబ్రహం అనే అధికారి మాత్రం వీరి చర్యలను వృత్తిలో ఆ పోలీసుల నిబద్ధతను తెలియజేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని పోలీసుశాఖ తెలిపింది. పోలీసులు బాధిత కుటుంబానికి సహాయం చేశారని, వారిపై చర్యలు తీసుకునే అవకాశం తక్కువేనని పక్క ఇంట్లో ఉండే వృద్ధురాలు ఎమ్మా జక్కారిని అభిప్రాయపడ్డారు. భారీ ఆస్తినష్టం సంభవించిందని, ప్రాణ నష్టం మాత్రం జరగలేదని అగ్నిమాపక శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.