
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు సంబంధించి తాజాగా ఓ రహస్యం వెలుగులోకి వచ్చింది. ఆయనకు ఓ అశ్లీల చిత్రాల నటితోనూ శారీరక సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. అయితే, అధ్యక్ష పదవిలోకి రాకముందే ఆ సంబంధం ఉందని, ఆ విషయం బయటకు తెలియకుండా ఉండేందుకు, దానిని ఎక్కడా మాట్లాడకుండా ఉండేందుకు పెద్ద మొత్తంలో ఆ నటికి సొమ్ములు ముట్టజెప్పినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. స్టీపానీ క్లిఫార్డ్ అనే అమెరికన్ ఓ పోర్న్‌స్టార్. 2006లో ఆమె ఓ గోల్ఫ్ గేమ్ జరుగుతుండగా ట్రంప్‌ను కలిసింది. ఆ సమయంలోనే ట్రంప్ మూడో వివాహం (మెలానియా)ను చేసుకున్నారు. అయినప్పటికీ తనకు పరిచయం అయిన క్లిఫార్డ్‌తో ట్రంప్ శారీరక సంబంధం పెట్టుకున్నాడు.
అయితే, ట్రంప్ అమెరికా అధ్యక్ష బరిలో దిగుతుండగా గుడ్ మార్నింగ్ అమెరికా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ట్రంప్‌తో తనకున్న సంబంధాలు మాట్లాడే ప్రయత్నం చేయగానే ఈ విషయం బయటకు పొక్కనీయకుండా చూసేలా మైఖెల్ కోహెన్ అనే న్యాయవాదికి ట్రంప్ బాధ్యతలు అప్పగించాడు. దాంతో మైఖెల్ మధ్యవర్తిగా ఉండి అధ్యక్ష ఎన్నికలకు కొద్ది వారాల ముందు క్లిఫార్డ్‌కు ఏకంగా లక్షా ముప్పైవేల డాలర్లు చెల్లించాడు. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో బయటకు రానివ్వొద్దని ఆమె దగ్గర హామీ తీసుకున్నాడు. ఈ విషయాలన్నింటిని పూసగుచ్చినట్లుగా వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. అయితే, వీటన్నింటిని మైఖెల్ కొట్టిపారేయగా క్లిఫార్డ్ మాత్రం స్పందించలేదు. వైట్ హౌస్ మాత్రం ట్రంప్‌పై చేసిన తాజా ఆరోపణలు అబద్ధాలని, కుట్రలని కొట్టి పారేసింది. గతంలో ట్రంప్‌పై ఇలాంటివి పలు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment