పార్లమెంటుకు, సుప్రీం కోర్టుకు కరెంట్ కట్
పార్లమెంటు, సుప్రీంకోర్టు, ప్రధానమంత్రి కార్యాలయాలు భారీ మొత్తంలో విద్యుత్ బకాయీలు చెల్లించకపోవడంతో వాటికి విద్యుత్ సరఫరా నిలివేశారు. ఈ మూడే కాదు. మరో ప18 ప్రధాన కార్యాలయాలకు కూడా విద్యుత్ సరఫరా ఆపేశారు.
ఇదంతా ఇండియాలో అనుకుంటున్నారా? కాదండీ.... ఇది మన దాయాది పాకిస్తాన్ లో పరిస్థితి. విద్యుత్ బకాయీలు చెల్లించని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలపై కొరడా ఝళిపించమని ప్రధాని నవాజ్ షరీఫ్ ఆదేశించారు. అయితే మధ్యాహ్నానికే ఆయన సుప్రీంకోర్టుకి, చీఫ్ జస్టిస్ ఇంటికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించమని ఆదేశించారు.
ప్రతి వేసవిలోనూ పాకిస్తాన్ లో పవర్ కట్ పెద్ద సమస్యగా మారుతుంది. దేశమంతటా గంటల పాటు కరెంటు సరఫరా ఉండదు. చాలా గ్రామాలు, కొన్ని పట్టణాలు కూడా నిరంతరం చీకటిలో ఉండాల్సిందే. దీనికి వ్యతిరేకంగా ప్రతి సారీ పాకిస్తాన్ అంతటా భారీగా నిరసన ప్రదర్శనలు జరుగుతాయి. దీనికి ప్రధాన కారణం విద్యుత్ చౌర్యం, ప్రభుత్వ కార్యాలయాల బిల్లు బకాయీలు. అందుకే ప్రజా నిరసనను తట్టుకునేందుకే ప్రధాని నవాజ్ షరీఫ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
పార్లమెంటు దాదాపు 12 లక్షల డాలర్లు, ఇస్లామాబాద్ టౌన్ హాల్ 36 లక్షల డాలర్లు, బాకీ పడ్డాయి. పాకిస్తానీ విద్యుత్ శాఖ విద్యుత్ సరఫరా చేసే కంపెనీలు 5000 మిలియన్ డాలర్లు బాకీ ఉంది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రధాని నవాజ్ షరీఫ్ చెబుతున్నారు.