భూకంప తాకిడికి దెబ్బతిన్న బోట్లు
శాంటియాగో(ఐఏఎన్ఎస్): దక్షిణ అమెరికా దేశం చిలీకి ఉత్తరాన పసిఫిక్ మహా సముద్రంలో మంగళవారం రాత్రి 11:46 గంటలకు భారీ భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 4:30 గంటలకు రిక్టర్‌స్కేలుపై 8.2 త్రీవతతో ఈ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి రెండు మీటర్ల ఎత్తున సునామీ అలలు ఎగిసిపడుతూ చిలీ తీరాన్ని తాకాయి. సునామీ అలల వల్ల ఆరుగురు మరణించినట్లు చిలీ అధికారులు ప్రకటించారు.
సముద్ర అలలు ఇంకా ఒక మీటరు ఎత్తున ఎగిసిపడుతున్నాయని, తీరప్రాంతంలోని సుమారు 6 లక్షల మందిని ఎతైన, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. భూకంపం సుమారు రెండు నిమిషాల పాటు సంభవించింది. అనంతరం 10 గంటల తర్వాత కూడా ప్రకంపనలు వస్తున్నాయి. ఇప్పటిదాకా 17 సార్లు ప్రకంపనలు వచ్చాయని అధికారులు తెలిపారు. వందల సంఖ్యలో ఫిషింగ్ బోట్స్ దెబ్బతిన్నాయి. భూకంపం ధాటికి తీరప్రాంతంలోని పలు చోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. ప్రజలు ప్రాణభయంతో వీధుల్లోకి పరుగెత్తారు. పలుచోట్ల విద్యుత్ స్తంభించిపోయి అంధకారం అలుముకుంది. అయితే పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించలేదని విపత్తుల సహాయక సంస్థ వెల్లడించింది. ఉత్తర చిలీలోని ఇక్విక్ మైనింగ్ ఏరియాకు 86 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో 10 కిలో మీటర్ల లోతులోనే భూకంప కేంద్రం ఏర్పడినట్లు యూఎస్ జియోలజికల్ సర్వే వెల్లడించింది.
కాగా చిలీ మధ్య, దక్షిణ ప్రాంతాల్లో 2010లో 8.8 తీవ్రతతో శక్తిమంతమైన భూకంపం సంభవించడంతో భారీ సునామీ ఏర్పడి పలు పట్టణాల్లో విధ్వంసమయ్యాయి. అప్పుడు సుమారు 500 మంది మరణించగా, 30 బిలియన్ డాలర్ల ఆస్తి నష్టం సంభవించింది.