అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ
కాబుల్: అమెరికా–తాలిబన్ల శాంతి ఒప్పందం అమలుకు ఆదిలోనే ఆటంకాలు ఎదురయ్యాయి. జైళ్లలో ఉన్న తాలిబన్లను తక్షణమే విడుదల చేయడం కుదిరే పని కాదని అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ తేల్చి చెప్పారు. మార్చి 10 నుంచి నార్వే రాజధాని ఓస్లోలో అఫ్గాన్ ప్రభుత్వం, ఇతర రాజకీయ పార్టీలు, వివిధ వర్గాలతో అధికార పంపిణీపై సంప్రదింపులున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు తాలిబన్లను విడుదల చేయలేమని ఘనీ స్పష్టం చేశారు. రెండు దశాబ్దాల యుద్ధానికి స్వస్తి పలుకుతూ శాంతి ఒప్పందం కుదుర్చుకున్న అమెరికా తన సైనిక బలగాలను వచ్చే 14 నెలల్లో ఉపసంహరిస్తామని ప్రకటించింది.
అయితే ఈలోగా తాలిబన్లు ఎలాంటి దాడులకు పాల్పడకూడదని షరతు విధించింది. అలాంటప్పుడు అఫ్గాన్ అధికార యంత్రాంగంతో చర్చలు జరగకుండా తాము తాలిబన్లను జైళ్ల నుంచి ఎందుకు విడుదల చేయాలని అధ్యక్షుడు ఘనీ ప్రశ్నించారు. జైళ్ల నుంచి ఖైదీలను విడుదల చేసే నిర్ణయం పూర్తిగా తమ ప్రభుత్వం ఇష్టమేనని, తదుపరి చర్చలు మొదలవకుండా ఖైదీలను విడుదల చేసే ఉద్దేశం లేదని చెప్పారు. మరోవైపు అమెరికా శాంతి దూత జల్మే ఖలీల్‌జద్ తాలిబన్లను జైళ్ల నుంచి విడుదల చేస్తేనే వారిలో విశ్వాసం వస్తుందని అంటున్నారు. ఓస్లోలో చర్చలకు ముందే అఫ్గాన్ ప్రభుత్వం 5 వేల మంది తాలిబన్ ఖైదీలను విడుదల చేస్తుందని ఈ ఒప్పందం సందర్భంగా అమెరికా హామీ ఇచ్చింది. ఇప్పుడు అధ్యక్షుడు ఎదురు తిరగడంతో ఈ ఒప్పందం అమలుపై సందేహాలు నెలకొన్నాయి.
అఫ్గాన్ మహిళల్లో భయం భయం
అమెరికా–తాలిబన్ల ఒప్పందం అఫ్గాన్ మహిళల్లో భయాన్ని నింపుతోంది. తాలిబన్లు అధికారంలోకి వస్తే ఎలాంటి సమస్యలు తెస్తారోనని ఆందోళన చెందుతున్నారు. 2001 తర్వాత అమెరికా అఫ్గాన్‌ని ఆక్రమించడానికి ముందు తాలిబన్లు అయిదేళ్ల పాటు చేసిన అరాచకాలు అక్కడ మహిళల్ని వెంటాడుతూనే ఉన్నాయి. అఫ్గాన్‌లో శాంతి నెలకొనాలంటే తమ జీవితాల్ని పణంగా పెట్టాలేమోనన్న అనుమానం వారిని ఆందోళనకు గురిచేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment