ట్రంప్ తొలగింపునకు సమయం ఆసన్నమైందా?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తొలగింపునకు సమయం దగ్గరపడుతోందా?. అమెరికన్ పత్రికల్లో వస్తున్న సంచలన కథనాలు ట్రంప్ త్వరలోనే ఉద్వాసనకు గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న రష్యా అధికారులతో దేశానికి చెందిన రహస్య సమాచారాన్ని ట్రంప్ పంచుకున్నారని వాషింగ్టన్ పోస్టులో ఓ రిపోర్టు వచ్చింది.
దీన్ని తొలుత వైట్‌హౌస్ తోసి పుచ్చింది. తర్వాత స్వయంగా ట్రంపే.. ఐతే తప్పేంటి. దేశాధ్యక్షుడిగా ఉగ్రవాదంపై మిత్ర దేశానికి సమాచారం ఇవ్వడంలో తప్పులేదని తనను తాను సమర్ధించుకున్నారు. తాజాగా మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ ఫ్లైన్‌పై విచారణను నిలిపివేయాలని ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కామీని ట్రంప్ కోరినట్లు న్యూయార్క్ టైమ్స్ సంచలన వార్తను ప్రచురించింది.
డైరెక్టర్ పదవి నుంచి తప్పించకముందు వరకూ ట్రంప్, ఫ్లైన్‌ల మధ్య జరిగిన పూర్తి సంభాషణల వివరాలు కామీ వద్ద ఉన్నాయని పేర్కొంది. అయితే, కామీ రాసుకున్న నోట్స్ తమ చేతిలో లేదని.. ఓ సోర్స్ ద్వారా కామీ నోట్స్‌ను పూర్తిగా చదివినట్లు రిపోర్టులో పేర్కొంది. ఫిబ్రవరి 14న జరిగిన ఓ సమావేశంలో కామీని కలుసుకున్న ట్రంప్.. 'ఫ్లైన్ మంచివాడు, అతని వదిలేస్తావని ఆశిస్తున్నా' అని మాట్లాడినట్లు చెప్పింది.
మహాభియోగం తప్పదా?
కథనంపై స్పందించిన వైట్ హౌస్.. అధ్యక్షుడిపై అసత్య ప్రచారం చేయడం తగదని వ్యాఖ్యానించింది. జనరల్ ఫ్లైన్ దేశ రక్షణ కోసం ఎంతో కృషి చేశారని చెప్పింది. ఫ్లైన్‌పై విచారణను నిలిపివేయాలని అధ్యక్షుడు ట్రంప్ కామీ లేదా మరే ఇతర వ్యక్తిని కోరలేదని పేర్కొంది. కాగా, ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో గెలుస్తారని.. కానీ కొద్ది రోజులకే రాజద్రోహం కింద అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతారని ప్రొఫెసర్ అలన్ లిట్చ్‌మన్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఓ పత్రికకు ఇంటర్వూలో ఇచ్చిన లిట్చ్‌మన్ ట్రంప్‌పై మహాభియోగ తీర్మానం ప్రవేశపెడతారని పేర్కొన్నారు.