ఉత్తర కొరియా జాతీయ నిఘా విభాగం అధ్యక్షుడు కిమ్ యోంగ్ చోల్
సియోల్ : ఉత్తర కొరియా జాతీయ నిఘా విభాగం అధ్యక్షుడు కిమ్ యోంగ్ చోల్ దక్షిణ కొరియాలో అడుగుపెట్టవద్దంటూ అక్కడ నిరసనకారులు ఆందోళనకు దిగారు. పియాంగ్‌చాంగ్‌లో జరిగే శీతాకాల ఒలంపిక్స్ ముగింపు ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఉత్తర కొరియా నుంచి కిమ్ యోంగ్ చోల్ నేతృత్వంలో 8 మంది ఉన్నతస్థాయి అధికారుల బృందం ఆదివారం దక్షిణ కొరియాకు చేరుకుంది. 2010 సంవత్సరంలో దక్షిణ కొరియాకు చెందిన యుద్ధనౌకను అకారణంగా పేల్చివేసిన ఘటనలో 46 మంది సైనికులు చనిపోయారు. ఈ సంఘటనకు ప్రధాన సూత్రధారిగా కిమ్ యోంగ్ చోల్‌ను భావిస్తున్నారు.
దీంతో ఆయన రాకను నిరసిస్తూ పాజులో అప్పుడు చనిపోయిన సైనికుల కుటుంబాలు, కొంత మంది చట్టసభ్యులు ఆందోళనకు దిగారు. కిమ్ యోంగ్ చోల్ పర్యటనపై ప్రజలు అసహనం ప్రదర్శిస్తున్నప్పటికీ రెండు దేశాల మధ్య దైపాక్షిక సంబంధాలు, శాంతి భద్రతలు మెరుగుపడతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆయన పర్యటనను ఆహ్వానించింది. ఫిభ్రవరి 9న జరిగిన ప్రారంభోత్సవానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్, ఉన్ ప్రభుత్వంలో కీలక అధికారి కిమ్ యోంగ్ నామ్ హాజరైన సంగతి తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment