దేశాధినేతలు, ప్రముఖుల బాగోతం బట్టబయలు!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ సన్నిహితులు మొదలు.. అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు లియోనాల్ మెస్సీ వరకు అనేకమంది ప్రస్తుత, మాజీ దేశాధ్యక్షులు, ప్రముఖుల నల్లడబ్బు బాగోతం బట్టబయలైంది. పన్నులు ఎగ్గొటి.. నల్లడబ్బుకు స్వర్గధామాలైన దేశాల్లో వీరు కోట్లకొద్ది సంపద కూడబెట్టుకున్నట్టు తాజాగా వెల్లడైంది. ప్రపంచంలోనే అతిపెద్ద లీక్‌గా భావిస్తున్న కోటి 15 లక్షల పత్రాలను పరిశీలించడం ద్వారా ఈ వివరాలను వెలుగులోకి వచ్చాయి. ఇందులో 500 మంది భారతీయుల పేర్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
అంతర్జాతీయ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు కన్సార్టియం (ఐసీఐజే) దాదాపు ఏడాదిపాటు ఈ పత్రాలను పరిశీలించి జర్మనీ దినపత్రిక 'సుడియుషె జీతంగ్'లో ఈ వివరాలు వెల్లడించారు. ఇందులో 140 మంది రాజకీయ నాయకులు పేర్లు ఉండగా, అందులో 12 మంది తాజా, మాజీ దేశాధినేతలు ఉన్నారు. నల్లడబ్బుకు ఆవాసాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2,14,000 సంస్థలకు చెందిన కోటి 15 లక్షల పత్రాలు లీకయ్యయాయి. 1975 నుంచి గత ఏడాది చివరివరకు ఉన్న వివరాలు ఇందులో ఉన్నాయని, ఈ పత్రాలను పరిశీలిస్తున్న కొద్దీ గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని వివరాలు వెలుగులోకి వస్తున్నాయని ఐసీఐజే పేర్కొంది.
లండన్‌లో షరీఫ్ సంపన్న సామ్రాజ్యం
పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కొడుకులు హుస్సైన్, హసన్, కూతురు మరియమ్ సఫ్దర్ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో భారీగా కంపెనీలు స్థాపించారు. నల్లడబ్బుతో పెట్టిన ఈ కంపెనీల ద్వారా లండన్‌లోని హైడ్ పార్క్ సమీపంలో భారీ ఆస్తులను షరీఫ్ కుటుంబం వెనుకేసుకుంంది. డుచే బ్యాంకులోనూ, స్కాట్‌లాండ్‌లోని బ్యాంకుల్లోనూ ఈ ఆస్తులను తనఖా పెట్టి భారీగా రుణాలు కూడా పొందింది.
రెండు బిలియన్ డాలర్లను పోగేసిన పుతిన్!
లీకైన ఈ పత్రాల్లో ఎక్కడ కూడా నేరుగా పుతిన్ పేరు కనిపించనప్పటికీ, ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా లబ్ధి పొందిన ఆయన స్నేహితులు భారీగా నల్లడబ్బును విదేశాల్లో పోగేసినట్టు తేలింది. ఆయన సన్నిహితులు ఇలా పోగేసిన డబ్బు ద్వారా వివిధ రూపాల్లో తిరిగి పుతిన్ కుటుంబానికి చేరినట్టు గార్డియన్ పత్రిక జరిపిన పరిశోధనలో వెల్లడైంది. పుతిన్, ఆయన సన్నిహితులు ఏకంగా 2 బిలియన్ డాలర్లు (రూ. 13,269 కోట్లు) పోగేసినట్టు తెలుస్తున్నదని ఆ పత్రిక తెలిపింది.
అంతేకాకుండా చైనా ప్రధాని గ్జి జింగ్‌పింగ్, ఉక్రెయిన్ అధ్యక్షుడు, ఐస్‌లాండ్ ప్రధానమంత్రి, ఫుట్‌బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ, చైనా యాక్షన్ స్టార్ జాకీ చాన్.. చాలామంది నేతలు, ప్రముఖులు పన్ను ఎగ్గొట్టి అక్రమంగా విదేశాల్లో దాచుకున్న నల్లడబ్బు వివరాలు ఈ పత్రాల్లో ఉన్నాయని జర్మనీ పత్రిక పేర్కొంది. పాత్రికేయ ప్రపంచానికి సంబంధించినంత వరకు ఇది అతిపెద్ద లీక్ అని అమెరికా విజిల్ బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడన్ ట్వీట్ చేశారు.
Biggest leak in the history of data journalism just went live, and it's about corruption. https://t.co/dYNjD6eIeZ pic.twitter.com/638aIu8oSU
— Edward Snowden (@Snowden) 3 April 2016