
ఖైదీల ఘర్షణ.. 28మంది దారుణ హత్య
మెక్సికోలోని ఓ జైలులో చెలరేగిన హింసలో 28 మంది హత్యకు గురి కాగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
మెక్సికో: మెక్సికోలోని ఓ జైలులో చెలరేగిన హింసలో 28 మంది హత్యకు గురి కాగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గుయెర్రెరో రాష్ట్రం లాస్‌క్రూసెస్ ఫెడరల్ జైలులో గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఖైదీల మధ్య గ్రూపు గొడవలున్నాయని ఈ నేపథ్యంలోనే హత్యాకాండ జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలు కిచెన్, సెక్యూరిటి వింగ్, విజిటింగ్ ఏరియాలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ప్రత్యర్థి వర‍్గం వారిని తీవ్రంగా కొట్టి చంపారని, కొందరి గొంతులు కోసి ఉండగా, మరికొందరి శరీరాలపై బుల్లెట్ గాయాలున్నాయని భద్రతా అధికారి ఒకరు తెలిపారు.
కాగా, తమ వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకునేందుకు ఖైదీల బంధువులు జైలు వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మెక్సికోలోని జైళ్లలో చాలా వరకూ ఖైదీల ఆధిపత్యమే నడుస్తుంటుంది. ఇక్కడి కారాగారాల్లోకి ఆయుధాలు, మద్యం, మాదకద్రవ్యాల రవాణా యథేచ్ఛగా జరుగుతుంటుంది. దీంతో ఆధిపత్యం కోసం ఖైదీల ముఠాలు తరచూ గొడవలకు దిగుతుంటాయి. 2016లో టోపోచికో జైలులో ఖైదీల మధ్య జరిగిన కాల్పుల్లో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో అప్రమత్తమైన ప్రభుత్వం పోలీసులతో పాటు సైన్యాన్ని రంగంలోకి దించింది. జైలుపై రెండు హెలికాప్టర్లు ఎల్లప్పుడూ పహారాకు ఉండేలా ఏర్పాట్లు చేశారు.