అమెరికా బర్క్‌లీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు.
వాషింగ్టన్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అమెరికా బర్క్‌లీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో సోమవారం ప్రసంగించనున్నారు. భారత్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల గురించి ఆయన ఉపన్యసిస్తారు. రాహుల్ తాత, తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కూడా బర్క్‌లీలో 1949లో ఓ సారి ఉపన్యాసం ఇచ్చారు. దాదాపు రెండు వారాలపాటు రాహుల్ అమెరికాలో ఉంటారని ఆయన పర్యటన ఏర్పాట్లు చూస్తున్న ప్రముఖ సాంకేతిక నిపుణుడు శ్యాం పిట్రోడా చెప్పారు.
రాహుల్ అమెరికాలోని రాజకీయ నాయకులను, వివిధ రంగాల్లోని నిపుణులను, భారత సంతతి ప్రజలను ఈ వారంలో కలవనున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, టెక్నాలజీ, అవకాశాలపై వివిధ దేశాలకు చెందిన నిపుణులతో రాహుల్ చర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకుంటారని శ్యాం పిట్రోడా వెల్లడించారు. భారత సంతతి ప్రజలను రాహుల్ న్యూయార్క్‌లో కలుసుకుంటారన్నారు. అమెరికాలో అధికార రిపబ్లికన్ పార్టీ నాయకులతో కూడా రాహుల్ భేటీ అయ్యే అవకాశం ఉంది.
‘ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఏం జరుగుతోంది? ప్రపంచ దృక్కోణం ఎలా ఉంది? అనే విషయాలను రాహుల్ మరింతగా అర్థం చేసుకోవాలనుకుంటున్నార’ని శ్యాం పిట్రోడా చెప్పారు. రాహుల్ గాంధీ అమెరికాలో బహిరంగ సమావేశాలు నిర్వహించడం, రాజకీయ నాయకులతో భేటీ అవ్వడం, ఉపన్యాసాలివ్వడం బహుశా ఇదే తొలిసారి కావొచ్చు. ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలోనూ రాహుల్ ప్రసంగించనున్నారు.