ఉగ్రవాదులను కీర్తించడం మానండి
♦ పాకిస్తాన్‌కు భారత్ స్పష్టీకరణ
♦ సార్క్ సదస్సులో రాజ్‌నాథ్ ప్రసంగం
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ : ఉగ్రవాదులను కీర్తించడం, ఉగ్ర సంస్థలను ప్రోత్సహించడం మానుకోవాలని పాకిస్తాన్‌కు భారత్ విస్పష్టంగా చెప్పింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలపై చర్యలు తీసుకుని, వాటిని ఒంటరిని చేయాలంటూ 7వ సార్క్ దేశాల హోంమంత్రుల సదస్సులో తన వాణి వినిపించింది. గురువారం ఇస్లామాబాద్‌లో జరిగిన ఈ సదస్సులో భారత హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగించారు. పాక్ చర్యల్ని తూర్పారబట్టారు. మంచి ఉగ్రవాదం, చెడు ఉగ్రవాదం అని విడిగా లేవని, ఉగ్ర చర్యల్ని కంటితుడుపు చర్యగా ఖండించకూడదని పేర్కొన్నారు. ఉగ్రవాదులను స్వాతంత్య్ర సమరయోధులుగానో లేదా అమరవీరులుగానో కీర్తించకూడదన్నారు. భారతదేశానికో, సార్క్ సభ్యులకో తానీ సందేశం ఇవ్వడంలేదని, ప్రపంచ మానవాళి కోసం కోరుతున్నానని చెప్పారు.
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాది బుర్హాన్ వాని భారత దళాలు ఎన్‌కౌంటర్ చేసిన తర్వాత అతనిని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కీర్తించిన నేపథ్యంలో రాజ్‌నాథ్ ఈ వ్యాఖ్యలు చేస్తూ.. ఉగ్రవాదాన్ని ఎవరు సమర్థించినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఉగ్ర చర్యలకు దక్షిణాసియా ఎక్కువ ప్రభావితం అవుతోందన్న రాజ్‌నాథ్.. పఠాన్‌కోట్, ఢాకా, కాబూల్ దాడులను ప్రస్తావించారు. ఆతిథ్య దేశ ప్రధాని షరీఫ్, హోంమంత్రి చౌధరి నిసార్ అలీ ఖాన్ ప్రసంగంలో ఉగ్రవాదాన్ని కేవలం ఖండించడాన్ని రాజ్‌నాథ్ తప్పుబట్టారు. ఖండిస్తే సరిపోదని, దానిని తుడిచిపేట్టేలా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఉగ్రవాదం అణిచివేతపై సార్క్ ప్రాంతీయ సదస్సు, అదనపు ప్రోటోకాల్ తీర్మానాలను అమలు చేయాలని, సంయుక్త పోరాటానికి ఇదెంతో కీలకమని చెప్పారు. డ్రగ్స్ మాఫియా, నకిలీ నోట్ల మాఫియా ఉగ్రవాదానికి మద్దతిస్తున్నారని, దీన్ని సార్క్ నియంత్రించాలని అన్నారు.. సెప్టెంబర్ 22, 23 తేదీల్లో ఉగ్రవ్యతిరేక వ్యవస్థ మెరుగుకోసం నిపుణుల భేటీ ఢిల్లీలో ఏర్పాటు చేయడానికి అవకాశమిచ్చినందుకు రాజ్‌నాథ్ సార్క్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
భారత్ మీడియాకు అవకాశమివ్వలేదు.. సదస్సులో రాజ్‌నాథ్ ప్రసంగాన్ని కవర్ చేయడానికి ఢిల్లీ నుంచి వచ్చిన మీడియాను సభలోకి అనుమతించలేదు. వారిని పాక్ అధికారులు దూరంగా పెట్టారు. దీనిపై పాక్, భారత అధికారుల మధ్య వాగ్యుద్ధం జరిగింది. అంతకుముందు పాక్ హోం మంత్రితో కరచాలనం చేయడానికి రాజ్‌నాథ్ ఇష్టపడలేదు. పాక్ ఇచ్చిన మధ్యాహ్న భోజనాన్నీ తినకుండానే వెళ్లిపోయారు. సదస్సుకు ముందు ఇతర దేశాల ప్రతినిధులతో కలసి ప్రధాని షరీఫ్‌ను రాజ్‌నాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు. వీరి మధ్య ఏవిధమైన చర్చలు జరగలేదు. కాగాఉగ్రవాద నిర్మూలకకు సార్క్ దేశాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని షరీఫ్ చెప్పారు.
మోదీని కలసిన రాజ్‌నాథ్.. ఢిల్లీకి తిరిగొచ్చిన రాజ్‌నాథ్ విమానాశ్రయం నుంచి నేరుగా వెళ్లి ప్రధాని మోదీని కలుసుకుని సదస్సు గురించి తెలిపారు.
అది సాధారణమే..: రాజ్‌నాథ్ ప్రసంగాన్ని మీడియాలో ప్రసారం కానివ్వలేదన్న వార్తలపై భారత్ స్పందించింది. ‘సార్క్ సంప్రదాయం ప్రకారం ఆతిథ్య దేశం ఇచ్చే ప్రారంభ ప్రకటనను మాత్రమే మీడియాలో ప్రసారం చేస్తారు. మిగతా చర్చలు, ప్రసంగాలను ప్రసారం చేసేందుకు మీడియాకు అవకాశం ఇవ్వరు అది సాధారణమే’ అని స్పష్టం చేసింది.