ఇస్లామాబాద్ : పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌పై ఆయన మాజీ భార్య రెహమ్ ఖాన్ తన ఆత్మకథలో సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆమె తన ఆటోబయోగ్రఫీని విడుదల చేయడంతో ఇమ్రాన్ ఖాన్ చిక్కుల్లో పడ్డారు. తన మాజీ భర్త ఒక మత్తు బానిస అని, అతడి స్నేహితుడితో శారీరక సంబంధం కలిగి ఉండేవారని, ఆయనకు ఐదుగురు అక్రమ సంతానం ఉన్నారంటూ ఇలా తన ఆత్మకథలో ఎక్కువ భాగం ఇమ్రాన్ ఖాన్‌ను విమర్శిస్తూనే రాశారు.
అంతేకాకుండా తన పైశాచికత్వంతో భార్యను వేధించాడంటూ పాక్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ వసీం అక్రంపై కూడా వివాదాస్పద ఆరోపణలు చేశారు. అయితే పలువురు వ్యక్తులను కటువైన పదజాలంతో విమర్శిస్తూ రాసుకొచ్చిన రేహమ్... 445 పేజీలతో కూడిన తన ఆత్మకథలో కేవలం ఒకే ఒక వ్యక్తిని పొగడటం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఎంతో మర్యాద కలిగిన వ్యక్తి అంటూ రెహమ్ తన పుస్తకంలో రాసుకొచ్చారు.
అసలైన వ్యక్తిత్వం అంటే ఇదే..
గతంలో ఒక ప్రఖ్యాత చానల్‌లో జర్నలిస్టుగా పని చేసిన రెహమ్ ఖాన్.. ఓ కార్యక్రమంలో భాగంగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో కాసేపు ముచ్చటించారట. ‘2008లో డోంట్ డిలే... క్లెయిమ్ టుడే అనే కార్యక్రమంలో భాగంగా పాకిస్తాన్, భారత్ నుంచి కొంత మంది ప్రముఖ వ్యక్తుల ఇంటర్వ్యూ తీసుకోవాల్సి వచ్చింది. అందరిలోనూ ప్రధాన ఆకర్షణగా ఉన్న షారుఖ్ ఖాన్‌తో మాట్లాడాను. వృత్తి పట్ల అతడి నిబద్ధత అమోఘం. అంత పెద్ద సెలబ్రిటీ అయినా కొంచెం కూడా పొగరు లేదు. అతడి ప్రొఫెషనలిజం చూస్తే నాకు ముచ్చటేసింది. మధ్య తరగతి నుంచి వచ్చిన వ్యక్తిగా ఆయన తన మూలాల్ని మర్చిపోలేదు. నిజమైన వ్యక్తిత్వం అంటే అదే. షారుఖ్ ఎంతో మర్యాదస్తుడు’ అంటూ రేహమ్ ఖాన్ తన పుస్తకంలో రాశారు.
Comments
Please login to add a commentAdd a comment