
మంచుదిబ్బల కింద పదహారేళ్ల తర్వాత..
ఎట్టకేలకు అమెరికాకు చెందిన ప్రముఖ పర్వతారోహకుడు అలెక్స్ లోవ్ మృతదేహం బయటపడింది. అతడితోపాటు మరో కెమెరామ్యాన్ మృతదేహం కూడా వెలుగులోకి వచ్చింది.
న్యూయార్క్: ఎట్టకేలకు అమెరికాకు చెందిన ప్రముఖ పర్వతారోహకుడు అలెక్స్ లోవ్ మృతదేహం బయటపడింది. అతడితోపాటు మరో కెమెరామ్యాన్ మృతదేహం కూడా వెలుగులోకి వచ్చింది. తీవ్రమైన ఉష్ణోగ్రతల కారణంగా మంచుకరిగిపోవడంతో వారి మృత అవశేషాలు బయటపడ్డాయి. వీరు చనిపోయి ఇప్పటికీ 16 ఏళ్లు. పూర్తి వివరాల్లోకి వెళితే సరిగ్గా పదహారేళ్ల కిందట అంటే అక్టోబర్ 1999లో ప్రముఖ పర్వతారోహకుడు అలెక్స్ లోవ్, మరో ఇద్దరు సాహస యాత్రికులు కార్నార్డ్ యాంకర్, డేవిడ్ బ్రిడ్జెస్తో కలిసి టిబెట్ లోని శిషపాంగ్మా పర్వతం(8,013 మీటర్లు-26,291 అడుగులు)ను అధిరోహణకు బయలుదేరారు.
వారు మధ్యలో ఉండగా భారీ స్థాయిలో మంచుకొండచరియలు విరిగిపడి అందులోనే కూరుకుపోయి చనిపోయారు. ఒక్క కార్నార్డ్ యాంకర్ మాత్రం బతికి బయటపడ్డాడు. అయితే, మంచుకిందపడిపోయిన వారు ఏ చోటపడ్డారనే విషయం మాత్రం 16 ఏళ్లుగా తెలియలేదు. అలెక్స్ లోవ్ చనిపోవడంతో అతడి భార్య ఈ ప్రమాదంలో పడి క్షేమంగా బయటపడిన కార్నార్డ్ యాంకర్ ను 2001లో పెళ్లి చేసుకుంది.
ప్రస్తుతం వారు మోంటానాలోని బోజెమాన్లో జీవిస్తున్నారు. అలెక్సా పేరుతో ఓ చారిటబుల్ ట్రస్ట్ ను కూడా నడుపుతున్నారు. పర్వతారోహకులు చెప్పిన వివరాల ఆధారంగా ఆ రెండు మృతదేహాలు అలెక్స్, డేవిడ్వేనని కార్నార్డ్ యాంకర్ గుర్తించారు. ఏదేమైనా పదహారేళ్ల తర్వాత వారి మృతదేహాలు లభించడం తమకు కొంత ఊరటనిచ్చిందని వారు చెబుతున్నారు.