డాకర్ (సెనెగల్): పశ్చిమ ఆఫ్రికాలోని సెనెగల్‌లో ఒళ్లు జలదరించే దృశ్యం కనిపించింది. సెనెగల్ సాగర తీరంలో తేలియాడుతున్న పడవలో 30 కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాలు లభ్యమయ్యాయి. రాజధాని డాకర్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఈ పడవ కనిపించింది. నేవీ సిబ్బంది ఈ చెక్క పడవను ఓడరేవుకు చేర్చారు.
మృతదేహాలు కుళ్లిపోవడంతో వాటి గుర్తింపు కష్టంగా ఉందని స్థానిక అధికారులు తెలిపారు. అయితే ఇవి ఎవరివనేది గుర్తించేందుకు ఉన్న మార్గాల గురించి అధికారులు అన్వేషిస్తున్నారు. ఇటీవలికాలంలో సెనెగల్ నుండి స్పెయిన్ కానరీ దీవులకు వలసలు భారీగా పెరిగాయి. అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా 1,500 కిలోమీటర్లకు మించిన దూరాన్ని దాటి వలస సాగిస్తున్నారు.
ప్రాథమికంగా ఈ మృతదేహాలు వలసదారులవై ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. చాలా రోజులుగా అట్లాంటిక్ మహాసముద్రంలో ఈ పడవ ఉండివుంటుందని అధికారులు చెబుతున్నారు. గత ఆగస్ట్‌లో డొమినికన్ రిపబ్లిక్ తీరంలో ఒక పడవలో 14 మృతదేహాలు లభ్యంకాగా, అవి సెనెగల్ జాతీయులవై ఉంటాయని మత్స్యకారులు చెబుతున్నారు. కాగా అక్రమ వలసలను అరికట్టడానికి సెనెగల్ 10 సంవత్సరాల ప్రణాళికను ప్రకటించింది. నిరుద్యోగం, పేదరికం, అంతర్గత సంఘర్షణలతో విసిగిపోయిన యువకులు అట్లాంటిక్ మహాసముద్రంలో ఎదురయ్యే ముప్పును ఎదుర్కొంటూ కానరీ దీవులకు వలస వెళుతున్నారు.
ఇది కూడా చదవండి: యూపీలో ఎన్‌కౌంటర్.. రూ. లక్ష రివార్డు నిందితుని హతం
Comments
Please login to add a commentAdd a comment