
ఉత్తర కొరియా ప్రయోగం(ఫొటో: రాయిటర్స్)
ప్యాంగ్‌యాంగ్: ప్రపంచమంతా కరోనా వైరస్ భయంతో బిక్కుబిక్కుమంటుంటే ఉత్తర కొరియా మరోసారి దుందుడుకు చర్యకు దిగింది. వోన్సాన్ పట్టణం నుంచి సీ ఆఫ్ జపాన్(తూర్పు సముద్రం)పై బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించి.. సూపర్ లార్జ్ మల్టిపుల్ రాకెట్ లాంచర్ల పనితీరును పరిశీలించింది. జపాన్, కొరియా, రష్యాలో సరిహద్దులో ఉండే ద్వీపం లక్ష్యంగా ఆదివారం కవ్వింపు చర్యలకు పాల్పడింది. అయితే ప్రతీసారి క్షిపణి ప్రయోగాలను ప్రత్యక్షంగా వీక్షించే ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఈసారి మాత్రం వాటికి దూరంగా ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. జాతీయ రక్షణ, సైన్స్ అకాడమీ ఆధ్వర్యంలో అధికార పార్టీ ఉపాధ్యక్షుడు రీ ప్యాంగ్ చోల్ క్షిపణి ప్రయోగాలను పర్యవేక్షించినట్లు తెలిపింది.(కరోనా: ఉత్తర కొరియా దుందుడుకు చర్య!)
ఇక ఈ విషయంపై స్పందించిన దక్షిణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఎన్‌బీసీ న్యూస్‌తో మాట్లాడుతూ.. ‘‘ప్రపంచమంతా కరోనాతో పోరాడుతుంటే.. ఇక్కడ ఇలా... ఇది నిజంగా అనుచిత చర్య. అనుచిత ప్రవర్తనకు నిదర్శనం’’అని తీవ్రంగా మండిపడ్డారు. ఆదివారం ఉదయం ఆరు గంటల పది నిమిషాల సమయంలో సీ ఆఫ్ జపాన్‌లో రెండు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్లు పేర్కొన్నారు. ఉత్తర కొరియా చర్యలను దక్షిణ కొరియా, అమెరికా ఇంటలెజిన్స్ వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయని తెలిపారు. (కరోనా భయం: స్టైల్ మార్చిన ఉత్తర కొరియా!)
ఇదిలా ఉండగా.. ఈ విషయం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు కూడా తెలుసునని ఆయన ప్రభుత్వంలోని ఓ అధికారి వెల్లడించారు. జపాన్ రక్షణ శాఖ కూడా ఉత్తర కొరియా చర్యపై స్పందించిందని.. ఆ దేశ ప్రత్యేక ఎకనమిక్ జోన్‌కు అత్యంత సమీపంలో క్షిపణులు ల్యాండ్ అయినట్లు గుర్తించామని అధికారులు వెల్లడించారు. కాగా కొరియా ద్వీపకల్పంలో శాంతి స్థాపన, సంపూర్ణ అణ్వాయుధ నిరాయుధీకరణే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌లు 2018లో సింగపూర్‌లో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు ఉమ్మడి ఒప్పందంపై సంతకాలు చేశారు. ఆ తర్వాత ఇటీవల ట్రంప్ ఉత్తర కొరియాలో పర్యటించి చారిత్రాత్మక ముందడుగు వేశారు.
అయితే ఉత్తర కొరియా మాత్రం తన తీరును మార్చుకోకుండా నిరంతరం క్షిపణులను ప్రయోగిస్తూ దాయాది దేశాన్ని కలవరపెడుతోంది. ఇక ప్రాణాంతక వైరస్ కారణంగా తమ దేశంలో ఇంతవరకు ఒక్క మరణం కూడా సంభవించలేదని ఉత్తర కొరియా పేర్కొన్న విషయం తెలిసిందే. అంతేగాకుండా వరుసగా క్షిపణి ప్రయోగాలు జరుపుతూ ఆందోళనలు రేకెత్తిస్తోంది. కేవలం మార్చి నెలలోనే ఇప్పటి వరకు మొత్తం నాలుగుసార్లు క్షిపణులను పరిశీలించింది.
Comments
Please login to add a commentAdd a comment