
నైరోబీ: కెన్యా రాజధాని నైరోబీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. కెన్యా కాలమానం ప్రకారం .. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతలో ఈ ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ కెన్యాలోని బుసియా నుంచి వస్తున్న బస్సు నకురు–ఎల్‌డొరెట్ రహదారిపైకి రాగానే లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. దీంతో 30 మంది అక్కడికక్కడే మరణించగా, మరో ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు, లారీ డ్రైవర్లు ఇద్దరూ మరణించారు. మూడేళ్ల చిన్నారి ప్రాణాలతో బయటపడడం కొసమెరుపు. అయితే ఈ నెలలో ఈ రహదారిపై జరిగిన రోడ్డుప్రమాదాలలో మరణించిన వారిసంఖ్య 100కు చేరుకుందని పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల వల్ల మూడువేల మంది మృత్యువాత పడుతున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.