యుద్ధం జరగొచ్చు!
న్యూఢిల్లీ: రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత భయంకరమైన యుద్ధం త్వరలో అమెరికా-రష్యాల మధ్య జరగుతుందని అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు డిక్ చినే సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాపై జరిగే ఈ దాడిలో విమానాలు, బాక్స్ కట్టర్ ల కంటే ఎంతో శక్తిమంతమైన సామగ్రిని ఉపయోగిస్తారని పేర్కొన్నారు. బుష్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో డిక్ చినే ఉపాధ్యక్షుడిగా పని చేశారు.
ఎంటర్ టైన్ మెంట్ గ్లోబల్ సమ్మిట్లో మాట్లాడిన ఆయన ప్రపంచీకరణ నేపథ్యంలో జాతీయ భద్రతకు ఉన్న ఆపదల గురించి ప్రస్తావించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా హస్తం ఉందంటూ వస్తున్న సమకాలీన డెవలప్ మెంట్స్ పై ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా అమెరికాకు పెద్ద ముప్పుగా పరిణమిస్తోందని అన్నారు. నాటో దళాలను బలహీనపరిచేందుకు పుతిన్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే సిరియా, ఇరాన్ లలో రష్యా పాగా వేసిందని అన్నారు.
సైబర్ వార్ ద్వారా పుతిన్ అమెరికా ఎన్నికలను ప్రభావితం చేయం యద్ధానికి రెచ్చగొట్టడమేనని వ్యాఖ్యానించారు. ఒబామా సారధ్యంలోని ప్రభుత్వం అణుపరీక్షలకు తక్కువ నిధులు కేటాయించడంతో అమెరికా బలహీనంగా తయారైందని అన్నారు. ఇదే సమయంలో అమెరికా వ్యతిరేక శక్తులు శక్తిని తెచ్చుకుని పుంజుకున్నాయని చెప్పారు.