
ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ‘మౌనం’ వివాదం!
సిడ్నీ: ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో ఉన్న ఓ ఫుట్‌బాల్ స్టేడియం అది. మరికాసేపట్లో ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా జట్ల మధ్య వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఇంతలో స్టేడియంలోని అనౌన్సర్.. ఇటీవల లండన్ ఉగ్రదాడుల్లో మృతి చెందినవారికి సంతాపంగా ఆటగాళ్లు ఒక నిమిషం మౌనం పాటిస్తారని అనౌన్స్ చేశాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లంతా ఒక దగ్గర చేరి భుజాలపై చేతులేసుకొని మౌనం పాటించారు. అదే సమయంలో సౌదీ ఆటగాళ్లు మాత్రం తలో దిక్కు వెళ్లి పోయారు. కొందరైతే సీరియస్‌గా వామప్ చేస్తూ కనిపించారు.
గురువారం చోటుచేసుకున్న ఈ ఘటనలో సౌదీ ఆరేబియా ఆటగాళ్ల వ్యవహారంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. సోషల్ మీడియా సౌదీ టీంపై భగ్గుమంది. ఈ వ్యవహరంపై స్పందించిన ఆస్ట్రేలియా ప్రధాని టర్న్‌బుల్.. ఉగ్రవాదుల చర్యలను ఖండించడంలో, బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలపడంలో అందరూ ఒకటిగా ఉండాలన్నారు. దీంతో మొదట 'మౌనం పాటించడం మా సంస్కృతిలో భాగం కాదు' అన్నట్లు వ్యవహరించిన సౌదీ అరేబియా ఫుడ్‌బాల్ ఫెడరేషన్ తమ ఆటగాళ్ల ప్రవర్తనపై క్షమాపణలు కోరింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 3-2 తేడాతో విజయం సాధించింది.