పర్యావరణ ప్రేమికులకు, అంటార్కిటికా వాతావరణాన్ని ఇష్టపడేవారికి ఇదొక శుభవార్త.
సాక్షి, న్యూయార్క్ : పర్యావరణ ప్రేమికులకు, అంటార్కిటికా వాతావరణాన్ని ఇష్టపడేవారికి ఇదొక శుభవార్త. అంటార్కిటికాలోని రాస్‌ఐలాండ్ పర్వత ప్రాంతాల్లో కొత్త రకం జీవజాతులు వృద్ధి చెందుతున్నాయని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ (ఏఎన్‌యూ) పరిశోధకులు ప్రకటించారు. కొంతకాలంగా పర్యావరణంలో వస్తున్న మార్పుల వల్ల మంచు కరిగిపోవడంతో పాటు జీవజాలం తగ్గుతోందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏఎన్‌యూ పరిశోధకులు చెప్పిన ఈ మాట పర్యావరన వేత్తలకు ఆనందాన్ని కలిగిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
అంటార్కిటికాలోని మంచుకొండల దిగువన ఉండే గుహల్లో మనకు తెలియని మొక్కలు, జీవులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోస్‌లాండ్ గుహల్లోని మట్టిని సేకరించిన శాస్త్రవేత్తలు.. దానిపై పరిశోధన చేశారు. గుహలో కనీసం 25 డిగ్రీల వేడి ఉంటుందని చెబుతున్న సైంటిస్టులు అందులోనే నాచు, ఆల్గే, మనకు తెలియని జీవులు మనుగడ సాగిస్తుండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై మరింత విస్తృత స్థాయిలో పరిశోధనలు చేయాల్సి ఉందని ఎన్‌యూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.