తిందాం.. మెదడును మాయ చేద్దాం..
షుగరుంది.. కానీ స్వీట్స్ తినడమంటే ఇష్టం.. ఎలా?
బీపీ ఉంది.. ఉప్పు తగ్గితే ఒప్పుకోం.. మసాలాలంటే మరీ ఇష్టం.. మరెలా?
ఊబకాయమూ ఉంది.. ఐస్‌క్రీములు, పిజ్జా, బర్గర్లు అంటే ప్రాణం.. ఇంకెలా?
ఇలాంటివెన్నో సమస్యలకు పరిష్కారం ఈ ‘సెట్ టు మిమిక్’ అంటున్నారు ఈ డిజైన్ రూపకర్త రొమేనియాకు చెందిన సొరీనా రస్తీను. చెడు ఆహారపు అలవాట్లకు, ఫుడ్ అలర్జీలకూ చెక్ పెడుతుందని చెబుతున్నారు.
అసలు ఏంటిది: ఇదో అత్యాధునికమైన కిచెన్‌వేర్. ఇందులో ప్లేటు, గ్లాసుతోపాటు పారదర్శకంగా ఉండే చిన్నపాటి ప్యాచ్‌లాంటిది ఉంటుంది. మైక్రోచిప్ ఉండే ఆ ప్యాచ్‌ను మన బుర్రకు అంటించుకోవాలి. ప్లేటు, గ్లాసులో ఉన్న సెన్స ర్లు ఆ ప్యాచ్‌తో అనుసంధానమై ఉంటాయి. దీని వల్ల ఏం జరుగుతుందంటే.. మీరా ప్లేటులో యాపిల్ పెట్టుకుని తింటున్నా.. మీకిష్టమైన ఐస్ క్రీం తింటున్న అనుభూతి కలుగుతుంది. వాసన కూడా అలాగే వస్తుంది. దీని వల్ల ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీవనం సాధ్యపడుతుందని చెబుతున్నారు.
ఎలా పనిచేస్తుంది: ఈ గ్లాసు, ప్లేటులో డిటెక్టర్ బ్యాండ్స్ ఉంటాయి. ఉదాహరణకు.. మీరు ప్లేటులో యాపిల్ పెట్టినా.. గ్లాసులో జ్యూస్ వేసినా.. దాన్ని గుర్తించి, స్క్రీన్‌పై ప్రదర్శితమయ్యేలా చేస్తాయి. ఇప్పుడే అసలైన పని. మనకు బటర్ చికెన్ తినాలని ఉంది. కానీ ప్లేటులో యాపిల్ ఉంది. అప్పుడు మనమేం చేయాలంటే.. ఇందులో ఉండే ఆహార పదార్థాల జాబితా నుంచి చికెన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ప్యాచ్‌ను తలకు అంటించుకోవాలి. అవి మెదడులోని కణాలను ‘చికెన్’కు తగ్గట్లు ట్యూన్ చేస్తాయి. దీని వల్ల యాపిల్ తింటుంటే.. బటర్ చికెన్ తిన్న అనుభూతి మన మెదడుకు కలుగుతుంది. ‘జంక్ ఫుడ్ వంటివి నష్టం చేస్తాయన్న సంగతి మనకు తెలుసు. అయితే.. వాటి రుచి, వాసన కోసం తింటున్నారు. మెదడు వల్లే మనకవి తెలుస్తున్నాయి. అలాంటప్పుడు నేరుగా మెదడునే మాయ చేస్తే.. మనం జంక్ ఫుడ్‌ను తినకుండా.. దానికి ఆ అనుభూతిని కలుగజేస్తే సరిపోతుంది కదా అన్న ఆలోచనతోనే దీన్ని డిజైన్ చేశాం’ అని సొరీనా చెప్పారు. ఈ డిజైన్ ఇంత వినూత్నంగా ఉంది కాబట్టే.. ఎలక్ట్రోలక్స్ సంస్థ ఏటా నిర్వహించే ప్రతిష్టాత్మక డిజైన్ ల్యాబ్-2014 పురస్కారం టాప్-6 ఫైనలిస్టుల జాబితాకు ఇదీ ఎంపికైంది. మరో రెండ్రోజుల్లో విజేతను ప్రకటించనున్నారు.