
హిల్లరీపై ట్రంప్ ఘాటైన వ్యాఖ్యలు
లాస్ వెగాస్ : రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన నోటికి పని చెప్పారు. తన ప్రత్యర్థి అభ్యర్థి హల్లరీ క్లింటన్పై ఆయన నోరు పారేసుకున్నారు. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించినట్లుగా...తనకన్నా ఎక్కువగా మహిళలను గౌరవించరన్న ఆయన ...మరోవైపు హిల్లరీ న్యాస్టీ ఉమెన్ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
అవకాశం దొరికినప్పుడల్లా నోటి దురుసుతనంతో అక్కసు తీర్చుకునే ఆయన... చివరి డిబేట్లో హిల్లరీపై ఈ వ్యాఖ్యలు చేశారు. హిల్లరీ అబద్ధాలు ఆడుతున్నారని, ఆమె అనేక నేరాలకు పాల్పడ్డారని, ప్రభుత్వంలో ఉంటూ ప్రైవేటు ఈ-మెయిళ్లను వాడారని ట్రంప్ ఆరోపించారు. ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా, హిల్లరీ విదేశాంగ విధానాలు చెత్తగా ఉన్నాయన్నారు. విదేశీ ఉద్యోగుల పట్ల హిల్లరీ కనికరం చూపాలనుకోవడం వినాశకరమని ఆయన చెప్పుకొచ్చారు.
అలాగే హెల్త్ కేర్ విషయంలో హిల్లరీతో విభేదించారు ట్రంప్. ముఖ్యంగా తొమ్మిదో నెలలో గర్భస్థ శిశువును అబార్షన్ చేసేందుకు హిల్లరీ సుముఖం వ్యక్తం చేయగా, తాను అందుకు అంగీకరించనంటూ ట్రంప్ స్పష్టం చేశారు. అక్రమంగా దేశంలోకి వచ్చే వారిని తప్పనిసరిగా వెనక్కి పంపుతామని ఆయన మరోసారి స్పష్టం చేశారు.