అతి చిన్న న్యూట్రాన్ నక్షత్రం
మెల్‌బోర్న్: అంతరిక్షంలోని సుదూర ప్రాంతంలో నక్షత్రాలు, పాలపుంతల మధ్య ఉండే ఖాళీ ప్రదేశాల్లో పరిభ్రమిస్తున్న అతి చిన్న న్యూట్రాన్ నక్షత్రాన్ని ఆస్ట్రేలియా పరిశోధకులు గుర్తించారు. ఇప్పటి వరకూ గుర్తించిన న్యూట్రాన్ నక్షత్రాల్లో ఇదే అతి చిన్నదని వారు చెపుతున్నారు. ఇంతకు ముందు గుర్తించిన దానికంటే ఇది పది లక్షల రెట్లు కచ్చితమైనదిగా వారు పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని కర్టిన్ యూనివర్సిటీ పరిశోధకులు జీన్‌పెర్రీ మెక్‌క్వార్ట్ ఈ అంశంపై అధ్యయనం జరిపారు. ‘‘అంతరిక్షంలోని ఇతర వస్తువులతో పోలిస్తే న్యూట్రాన్ నక్షత్రాలు అతి చిన్నవి. న్యూట్రాన్ నక్షత్రాల్లో కొన్నింటిని పల్సర్లుగా పిలుస్తారు. కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అటువంటి పల్సర్ ‘బీ0834ప్లస్06ఆర్’ నక్షత్రంపై పరిశోధనలు నిర్వహించాం. నక్షత్రాలు, పాలపుంతల మధ్య ప్రాంతంలోని పల్సర్ల సిగ్నళ్ల ఆధారంగా ఈ న్యూట్రాన్ నక్షత్రాన్ని గుర్తించాం’’ అని మెక్‌క్వార్ట్ వెల్లడించారు. అతి భారీ లెన్స్‌లను వినియోగించి ఈ పరిశోధనలు కొనసాగించామని తెలిపారు.