స్మార్ట్‌గా సాగరయానం..
ఇప్పుడు అంతా స్మార్టే... ఫోన్ల దగ్గర నుంచి నగరాల వరకు అన్నీ స్మార్టే... ఈ భారీ షిప్ కూడా ఆ కోవలోకే వస్తుంది. దీని పేరు ‘క్వాంటమ్ ఆఫ్ ది సీస్’. ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్ షిప్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారీ నౌకల్లో మూడోది. ఇందులో ఉన్న సౌకర్యాలు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే! వేగవంతమైన వైఫై, స్కైడైవింగ్ సిమ్యులేటర్, కాక్‌టెయిల్ అందించే రోబో బార్‌టెండర్లు, సాగర అందాలను 360 డిగ్రీల కోణంలో తిలకించేందుకు పాసింజర్ పాడ్, స్విమ్మింగ్‌పూల్, భారీ స్క్రీన్ టీవీలు, అద్భుతమైన సూట్లు, వర్చువల్ బాల్కనీలు, ఇండోర్ స్డేడియాలు, 18 ఫుడ్ కోర్టులు... ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితాయే ఈ షిప్పంత అవుతుంది.
ఇంతకీ దీని పొడవు ఎంతో తెలుసా? 1,141 అడుగులు. అంటే, ఐదు బోయింగ్ 747 విమానాలను ఒకదాని వెనుక ఒకటి ఉంచితే ఎంత పొడవు ఉంటుందో అంత. వెడల్పు 136 అడుగులు.. బరువు 1,68,666 టన్నులు. ఒక్కోటీ 4,694 హార్స్‌పవర్ సామర్థ్యం కలిగిన నాలుగు థ్రస్టర్లు ఈ భారీ నౌకను ముందుకు కదిలిస్తాయి. మొత్తం 18 డెక్కులున్న ఈ ఓడలో 2090 గదులున్నాయి. వీటిలోని లగ్జరీ సూట్లు చూస్తే మనల్ని మనమే మైమరచిపోతాం.
ఇక సముద్ర అందాలను వినూత్నంగా తిలకించేందుకు ఓ పాసింజర్ పాడ్ ఏర్పాటు చేశారు. అందులో ఎక్కితే సముద్ర మట్టం నుంచి 300 అడుగుల ఎత్తులో 360 డిగ్రీల కోణంలో ప్రకృతి అందాలను తిలకించవచ్చు. ఇవన్నీ చూస్తుంటే ఓసారి ఈ షిప్ ఎక్కాలనిపిస్తోందా? కొంచెం ఖర్చవుతుంది మరి! రోజుకు ఓ లక్ష రూపాయలు మీవి కాదనుకుంటే ఈ విలాసవంతమైన ప్రయాణం మీ సొంతమవుతుంది. ఎనిమిది రోజలపాటు ఇందులో ప్రయాణించడానికి రూ.7.86 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది న్యూజెర్సీలోని కేప్ లిబర్టీ నుంచి ఫ్లోరిడాలోని పోర్ట్ కెనావరల్, నస్సావు మీదుగా బహమాస్‌లోని కోకోకే వరకు వెళ్లి, తిరిగి న్యూజెర్సీ వస్తుంది.