
టొరంటో : పిల్లల నుంచి పెద్దల వరకూ అందరి చేతుల్లో ఫోన్లు ఉంటున్నాయి. అయితే ఈ అలవాటు వల్ల చిన్నారులు మానసిక సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఎక్కువ సేపు ఫోన్లు, టీవీ చూసే చిన్నారుల్లో.. నిరాశ, నిస్పృహ వంటి మానసిక రుగ్మతలు పెరిగే ప్రమాదం ఉందని కెనడాలోని మాంట్రియల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ద్వారా ఇతరుల ఇష్టాలు, ఆకర్షణీయమైన జీవనశైలి వంటి అంశాలు చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు. పరిశోధనల్లో భాగంగా 12 నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న 3,826 మంది పిల్లలపై పరిశోధన నిర్వహించగా.. ఎక్కువ సమయం టీవీ చూస్తున్న, సోషల్ మీడియాలో గడుపుతున్న వారిలో మానసిక సమస్యలున్నట్లు గుర్తించామని శాస్త్రవేత్తలు వివరించారు.