న్యూఢిల్లీ: పరీక్షల్లో కాపీ కొట్టడం కూడా ఓ కళే అన్నారు మన పెద్దలు. ఈ కళా నైపుణ్యం కూడా సమాజంలో వస్తున్న సాంకేతిక విప్లవానికి అనుగుణంగా కొత్త పుంతలు తొక్కుతోంది. పరీక్ష హాలులోకి చీటీలు పట్టుకుపోవడం, చొక్కాల కింద చేతుల మీద రాసుకోవడం పాతపడిన విద్యలు. సరికొత్త సాంకేతిక పరికరాలు అందుబాటులోకి రావడంతో మైక్రోఫోన్లు ఉపయోగించడం, సెల్ ఫోన్లు ఉపయోగించడం (పరీక్షల్లో నిషేధించారు కనుక) కూడా కనుమరుగైంది.
ఇప్పుడు వాటి స్థానాల్లో కనిపించని వైర్‌లెస్ కెమేరాలు కలిగిన కళ్లజోడును ధరించడం, స్మార్ట్ వాచ్‌లను ఉపయోగించి కాపీ కొట్టడం కొత్త పుంతలు తొక్కింది. కళ్ల జోడుకున్న కెమేరాలు క్వశ్చన్ పేపర్‌ను స్కాన్‌చేసి ఎక్కడో ఉన్న మిత్రులకు అందజేస్తుంది. ఆ మిత్రులు ఆన్సర్లను స్మార్ట్ వాచ్‌కి పంపిస్తారు. ఇక వాటిని చూసుకొని రాసుకోవడమే తరువాయి. రహస్య సందేశాలను రాసుకోవడానికి ఉపయోగించే అల్ట్రా వాయలెట్ పెన్నులను కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే దాంతో పాటు పెన్ టార్చ్‌లైట్లను తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే టార్చి ఫోకస్ వేసినప్పుడు మాత్రమే ఆ అక్షరాలు కనిపిస్తాయి. శరీర రంగులో కలిసిపోయే ఇయర్ ఫోన్లు, పలు ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించి కూడా కాపీ కొడుతున్నారు.
పరీక్ష హాల్లోకి క్యాలుకులేటర్ల అనుమతిస్తున్నారు కనుక కొంత మంది అందులో ఉండే మెమోరి ఆప్షన్లను ఉపయోగించి కాపీ కొడుతున్నారు. మరికొందరు క్యాలుకులేటర్ల నల్లటి బాడీ వెనకాల పెన్సిల్‌తో జవాబులు రాసుకొని కాపీ కొడుతున్నారు. కంటికి దగ్గరగా పెట్టుకొని చూస్తే తప్పించి పెన్సిల్ రాత కనిపించదు. కొంత మంది పాత చీటిలనే కొత్త పద్ధతిలో కాపీకి ఉపయోగిస్తున్నారు. బ్రాండెడ్ మంచినీళ్ల బాటిల్‌ను కొని, లేబుల్‌ను అతి జాగ్రత్తగా తీసి అది తెల్లగా ఉండే వైపు జవాబులు అతికించి దాన్ని యథావిధిగా బాటిల్‌కు అతికిస్తున్నారు. అనుమానం రాకుండా సీల్డ్ బాటిల్‌ను పరీక్ష హాల్లోకి తీసుకెళుతున్నారు.
బాటిల్ పైనుంచి ఏటవాలుగా దగ్గరి నుంచి లోపలికి చూసినప్పుడు మాత్రమే అక్షరాలు కనిపిస్తాయి. డిజిటల్ గ్లాసెస్‌ను ఉపయోగించి బొటన గోటివేలు మీద ఆన్సర్లు రాసుకొచ్చి డిజిటల్ గ్లాసెస్ సహాయంతో కాపీ కొడుతున్నారు. కొంత మంది విద్యార్థులు చీటీలు పెట్టుకునే వీలున్న మర మెకానిజం పెన్నులను కూడా కాపీ కోసం ఉపయోగిస్తున్నారు. ఇవన్ని ఇప్పటివరకు బయటపడ్డ విషయాలు మాత్రమే. దొరక్కుండా కొంత పంథాలో కాపీ కొడుతున్నవారు ఎంత మంది ఉన్నారో!
వామ్మో! ఎన్ని రకాలుగా కాపీ కొడుతున్నారో!!
Published Wed, May 11 2016 6:38 PM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM
Advertisement
Advertisement