
అమెరికా ప్రజల సంచలన నిర్ణయం
వాషింగ్టన్: స్వలింగ సంపర్కుల విషయంలో అమెరికాలో మరో రికార్డు నమోదైంది. గేల వివాహానికి అమెరికాలో మద్దతివ్వొచ్చా.. వాటికి చట్టపరమైన గుర్తింపు ఉండాలా అనే అంశంపై నిర్వహించిన అభిప్రాయ సేకరణలో అమెరికాలో భారీ ఎత్తున స్పందన వచ్చింది. వాటికి అనుమతించాల్సిందేనని, చట్టాల ద్వారా గుర్తించాలని దాదాపు 61శాతం అమెరికన్లు తమ అభిప్రాయాలు చెప్పారు. గాలప్ అనే కంపెనీ ఈ అధ్యయనం నిర్వహించింది. 1996నాటి అభిప్రాయాలతో పోల్చగా ఈసారి రికార్డు స్థాయిలో మద్దతు తెలిపారు. ఆ సమయంలో కేవలం 27శాతంమంది మాత్రమే ఇలాంటి వివాహాలకు అనుకూలంగా ఓటువేశారు.
గే వివాహాలకు సంబంధించి అమెరికాలో గత కొద్ది రోజులుగా అమెరికాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో గాలప్ కంపెనీ స్వయంగా 2011 నుంచి ఒక అధ్యయనం ప్రారంభించింది. దాదాపు అన్ని వయసుల వారిని ఈ అధ్యయనం లో చేర్చింది. తాజాగా వారు చెప్పిన అభిప్రాయాలు గతంలో 1996నాటి సమయంలో నిర్వహించిన సర్వేతో పోల్చి చూడగా ఈసారి గతంలో చెప్పినవారి శాతంకన్నా రెట్టింపు అయింది. 30 ఏళ్లలోపు వారంతా గే వివాహాలకు ఓకే చెప్పగా.. 65 ఏళ్ల పైబడిన వారు మాత్రం ఓకే చెప్పడంతోపాటు వాటికి చట్టభద్రత ఇవ్వాలని, గుర్తింపునివ్వాలని చెప్పారు. గే సంఘాలకు చట్టపరమైన గుర్తింపు ఇవ్వాలని కూడా చెప్పారు.